బండ్లగూడ, జూన్ 6: హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన చైతన్య కాలనీలో వృద్ధ దంపతుల దారుణ హత్య జరిగింది. మసాజ్ పేరిట బురఖా వేసుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. రిడిల్స్కు చెందిన షేక్ అబ్దుల్లా-రిజ్వానా దంపతులు రెండు నెలల క్రితం బుద్వేల్లోని జన చైతన్య కాలనీలో కొత్తగా నిర్మించుకున్న ఇంటికి మారారు. గురువారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు బురఖా వేసుకుని వచ్చారు. అది గమనించిన వాచ్మెన్ అడగ్గా.. మసాజ్ చేయడానికి రమ్మని చెప్పారని వారు తెలిపారు. దీంతో వారిని లోపలికి అనుమతించారు. అలా బురఖాలో వచ్చిన ఇద్దరు ఇంట్లోకి వెళ్లగా.. ఐదు నిమిషాల్లోనే ఒకరు వెళ్లిపోయారు. ఇంకొకరు మాత్రం 45 నిమిషాల పాటు లోపలే ఉన్నారు. శుక్రవారం ఉదయం ఎంతసేపైనా షేక్ అబ్దుల్లా, రిజ్వానా దంపతులు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి వాచ్మెన్ ఇంట్లోకి వెళ్లిచూశారు. అక్కడ రక్తపు మడుగులో పడివున్న దంపతులను చూడగానే ఒక్కసారిగా షాకయ్యాడు. భయంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. బురఖా వేసుకుని వచ్చిన వాళ్లే వృద్ధ దంపతులను హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. అసలు బురఖాలో వచ్చింది ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతానికి హత్యకు గల కారణాలు తెలియరాలేదని.. ఈ కేసును అన్ని కోణాల్లోనే దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, రిజ్వానా బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసి రిటైరవ్వగా, షేక్ అబ్దుల్లా ఓ ప్రైవేటు కాలేజీలో హెచ్వోడీగా పదవీ విరమణ పొందారు. వారికి నలుగురు పిల్లు. వారంతా విదేశాల్లో స్థిరపడ్డారు.