బండ్లగూడ, జూన్ 6:రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన చైతన్యకాలనీలో వృద్ధ దంపతులు హత్యకు గురికావడం కలకలం స్పష్టించింది. మసాజ్ పేరిట బురఖా వేసుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రిడిల్స్కు చెందిన షేక్ అబ్దుల్లా, రిజ్వానా దంపతులు బుద్వేల్ లోని జనచైతన్య కాలనీలో నివాసముంటున్నారు.
రిజ్వానా బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి రిటైర్ కాగా, షేక్ అబ్దుల్లా ప్రైవేట్ కళాశాలలో హెచ్వోడీగా పని చేసి రిటైరయ్యారు. వారికి నలుగురు పిల్లలు. వారంతా విదేశాల్లో స్థిరపడ్డారు. గురువారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు బురఖా వేసుకుని వచ్చి వాచ్మెన్తో మాట్లాడారు. మసాజ్ చేయడానికి రమ్మన్నారని చెప్పారు. వాచ్మెన్ ఫోన్ చేసి ఓకే చెప్పడంతో వారిద్దరు పైకి వెళ్లారు.
అందులో ఒకరు కేవలం ఐదు నిమిషాల్లోనే వెనక్కి వెళ్లిపోయారు. ఇంకొక వ్యక్తి 45 నిమిషాల పాటు లోపలే ఉన్నారు. శుక్రవారం ఉదయం వృద్ధ దంపతులు ఎంతకీ బయటకు రాకపోవడంతో వాచ్మెన్ అనుమానం వచ్చి లోపలికి చూసేసారికి రక్తపు మడుగులో పడి ఉన్నారు. బురఖా వేసుకుని వచ్చిన వాళ్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు డీసీపీ చింతమనేని శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తులు ఎవరనేది ఆరా తీస్తున్నామన్నారు. హత్యకు దారిచేసిన కారణాలు తెలియ రాలేదన్నారు.