సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ మందగించింది. అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు… ప్రాజెక్టుకు అవసరమైన భూములను తీసుకోవడం వెనకబడిపోతున్నది. 7.5 కిలోమీటర్ల మెట్రోను పట్టాలెక్కించడానికి ఏడాది నుంచి కాలయాపన చేస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి భూసేకరణ అంశంపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ప్రాజెక్టు ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి. అయితే మెట్రో భూసేకరణను వ్యతిరేకిస్తూ వందలాది మంది బాధితులు కోర్టులను ఆశ్రయించడంతో ఇప్పటివరకు 250కి పైగా ఆస్తుల పంచాయతీ కొలిక్కి రాలేదు. దీంతో కోర్టు పరిధిలో ఆస్తుల అంశం నానుతూనే ఉంది.
ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టులో భూ వివాదాలు ప్రధాన సమస్యగా మారాయి. వందలాది మంది ఆస్తుల యజమానులు తమ ఆస్తులను కాపాడుకునేందుకు కోర్టులను ఆశ్రయించారు. చారిత్రక నిర్మాణాలు, మతపరమైన కట్టడాలు ఉండటంతో వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పినా… క్షేత్రస్థాయిలో భూసేకరణకు అడ్డు తగులుతూనే ఉన్నాయి. దీంతోనే మార్చి నుంచి ఏప్రిల్లోగా ప్రాజెక్టుకు అవసరమైన ఆస్తుల సేకరణ పూర్తి చేసి, కూల్చివేతలు మొదలుపెట్టాల్సి ఉంది. కానీ భూసేకరణ ఇబ్బందులతో ప్రాజెక్టు అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. ఆస్తులను హ్యాండోవర్ చేసిన ప్రాంతాల్లోనే కూల్చివేతలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కోర్టు పరిధిలో ఉన్న భూ వివాదాలు ముగిసేంత వరకు ప్రాజెక్టు పనులు కొలిక్కి తీసుకువచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
ప్రాజెక్టు పురోగతిపై సచివాలయంలో పెడుతున్న సమీక్షలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణంలో చొరవ తీసుకోకపోవడంతో, భూములు ఇచ్చేందుకు యజమానులు సమస్యలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో సర్కారు వైఫల్యం, ఓల్డ్ సిటీ మెట్రో పురోగతిని నిలువరిస్తోంది. ముఖ్యంగా చారిత్రక కట్టడాలు, భూములకు ఇచ్చే పరిహారంపైనే బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టులను ఆశ్రయించారు. కానీ ప్రభుత్వం ఈ అంశాలను పట్టించుకోకపోవడంతో… ప్రాజెక్టుకు అవసరమైన భూముల లభ్యత ప్రశ్నార్థకంగా మారుతున్నది.