సిటీబ్యూరో, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): ఓల్డ్ సిటీ మెట్రోకు నిధుల కొరత వేధిస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ నాటికే ఆస్తుల సేకరణ పూర్తికావాల్సి ఉండగా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చే అరకొర నిధులు నిర్వహణకు పోగా మిగిలిన మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తున్నారు. దీంతో ఓల్డ్ సిటీ మెట్రో రోడ్డు విస్తరణకు ఆస్తులను ఇచ్చేందుకు జనాలు మొగ్గుచూపడం లేదనే విమర్శలున్నాయి. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు దాదాపు 7.5కిలోమీటర్ల మెట్రో రైల్ నిర్మాణం డెయిలీ సీరియల్‌ను తలపిస్తోంది.
ఆస్తుల సేకరణ, పరిహారం చెల్లింపుల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం వద్ద లోపించిన స్పష్టత యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మార్గంలో ఆస్తుల సేకరణకు సంబంధించి రూ.1,000 కోట్లు ఖర్చు అవసరమౌవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో 900 ఆస్తుల సేకరణకు ఏర్పాట్లు చేయగా… గడిచిన 9 నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ మరో 250-300 మంది భూ యజమానుల నుంచి ఆస్తుల సేకరణ చేయాల్సి ఉండగా… ఇప్పటివరకు సేకరించిన వారికి కూడా పూర్తి పరిహారం చెల్లించలేదు.
ఈ మార్గంలో 7.5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి సుమారు రెండున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయగా.. ఇందులో పరిహారానికే రూ. 1,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. మిగిలిన మొత్తంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ప్రభుత్వం సర్దుబాటు చేస్తామని చెప్పినట్లుగా ప్రాజెక్టుకు నిధులు విడుదల జరగడం లేదు. ఇటీవల రూ.125కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ ఇంకా రూ.250 కోట్లు మంజూరు చేస్తే గానీ భూసేకరణ ప్రక్రియ పూర్తికాని పరిస్థితులు నెలకొన్నాయి.