Congress Govt | సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష గట్టింది. ఇండ్లను పొందిన అర్హులంతా రెండు పడక గదుల ఇంటిలో ఉండాల్సిందేంటూ హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే కేటాయించిన ఇండ్లను రద్దు చేస్తామంటూ హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగం అధికారులు డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయాలపై సర్వే చేస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాజెక్టులో ఎన్ని కేటాయింపులు జరిగాయి? వారు అర్హులేనా? అనర్హులు ఉన్నారా? లబ్ధిదారులు ఇతరులకు అమ్ముకున్నారా? కేటాయించిన ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ప్లాట్లు ఎన్ని ఉన్నాయి? అనే నిగ్గుతేల్చేందుకు క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు.
ఇందులో భాగంగానే మౌలిక సదుపాయాలు సరిగా లేక కొందరు, ఆర్థిక, రవాణా సదుపాయాల దృష్ట్యా కేటాయించిన ఇండ్లలోకి వెళ్లలేక కొందరు, పిల్లల చదువుల దృష్ట్యా సిటీలో ఉంటున్న మరికొందరు కేటాయించిన ఇండ్లలో వెళ్లేందుకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వీరినే లక్ష్యంగా చేసుకుని అధికారులు ప్రతి ఒక్కరూ లబ్ధిదారులు వారి వారి డబుల్ బెడ్రూం ఇండ్లలో ఉండి తీరాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తుండడం పట్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడే ఆయా ప్రాజెక్టుల్లో అసోసియేషన్ ప్రతినిధులు సైతం నిర్వహణ పేరిట లబ్ధిదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమున్నత ఆశయానికి గండి
నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న బలమైన సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం 111 చోట్ల లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే ఉన్న చోటనే 27 ప్రాంతాల్లో (ఇన్ సైట్)లో 5,363 మందికి, 39 లోకేషన్లలో 63,478 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేసిన సంగతి తెలిసిందే. లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంలో 66 లోకేషన్లలో మొత్తం 68,841 మందికి పట్టాలు అందజేశారు. అయితే కార్పొరేట్ స్థాయిలో ఈ ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. కొన్ని చోట్ల కరెంట్ కనెక్షన్, కేబుల్ నెట్వర్క్, ఇంటర్నెట్, ఇతర మెయింటనెన్స్ పనులు పెండింగ్లో ఉన్నాయి.
ఈ మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా కేసీఆర్ సర్కారు హెచ్ఎండీఏ నుంచి రూ. 100 కోట్లను జీహెచ్ఎంసీకి బదలాయించింది. నిబంధనల ప్రకారమే జీహెచ్ఎంసీ ఖజానాలోకి రూ.100 కోట్లు వచ్చి చేరాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నిధులను జీహెచ్ఎంసీ ఇతర వాటికి మళ్లించింది. ఫలితంగా మౌలిక వసతుల కల్పనలో జాప్యం చేస్తూ వస్తున్నది. లబ్ధిదారులు వరుస ఆందోళన చేస్తున్న కొన్ని చోట్ల మౌలిక వసతుల కల్పన చర్యలు చేపడుతూ వస్తున్నది. నేటికి చాలా చోట్ల ప్రాజెక్టుల వద్ద సరైన సౌకర్యాలు లేవని లబ్దిదారులు చెబుతున్నారు.
ఇండ్ల సముదాయాల్లో మంచినీరు, కరెంటు, రోడ్డు సదుపాయాలు కల్పించలేదని లబ్ధిదారులు మండిపడుతున్నారు. కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో లిఫ్టులు పనిచేయడం లేదని, విద్యా సంవత్సరం ప్రారంభమైనందున పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతుందని, ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించి డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఉండేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సరైన మౌలిక వసతులు కల్పించాల్సిన చోట అధికారులు పేదలను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని లబ్ధిదారులు పేర్కొన్నారు.