మేడ్చల్, మార్చి29(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో మరో మూడు మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లు పాసైన నేపథ్యంలో 34 గ్రామాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూములకు డిమాండ్ ఉంది.
అయితే మూడు మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి 34 గ్రామాలను కలుపుతున్నారు. దీంతో ఏదైనా నూతన అనుమతులు, ట్యాక్స్‌లకు సంబంధించిన విషయాలపై అవకతవకలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాలో మరో మూడు మున్సిపాలిటీలుగా అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట్లు మారనున్నాయి. ప్రస్తుతానికి మున్సిపాలిటీలుగా అసెంబ్లీలో బిల్లు అమోదం పొందినప్పటికీ గెజిట్ వచ్చే వరకు గ్రామపంచాయతీలుగానే కొనసాగనున్నాయి.
జిల్లాలో 61 గ్రామాలు ఉండగా గతేడాది సెప్టెంబర్‌లో 28 గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేసిన విషయం తెలిసిందే. మున్సిపాలిటీలుగా ఏర్పడనున్న అలియాబాద్ మున్సిపాలిటీలో 7 గ్రామ పంచాయతీలు మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 13, ఎల్లంపల్లి మున్సిపాలిటీలో 14 గ్రామ పంచాయతీలు కలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 13 మున్సిపాలిటీలు ఉండగా మరో మూడు మున్సిపాలిటీలు ఏర్పడుతున్న నేపథ్యంలో జిల్లాలో 16 మున్సిపాలిటీలు కానున్నాయి.