కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 26 : వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా కరెంటును సరఫరా చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు పేర్కొన్నారు. సాధారణ రోజులతో పోలిస్తే వేసవి కాలంలో విద్యుత్ వినియోగదం దాదాపుగా రెట్టింపు అవుతుంది. గతేడాది ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని సారించారు. విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న అంతరాయాలను తగ్గించేందుకు కొత్తగా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులోకి తెచ్చారు. ఆయా ప్రాంతాల్లో 11కేవీ, ఎల్టీ లైన్లను మార్చడం, విద్యుత్ స్తంభాలను తొలగించడం, విద్యుత్ తీగల వద్ద అంతరాయం కలిగించే చెట్ల కొమ్మలను తొలగించే పనులను చేపట్టారు. ఆయా ఫీడర్ల పరిధిలో జంక్షన్లను మరమ్మతులను చేశారు. వేసవిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నారు.
కూకట్పల్లి విద్యుత్ డివిజన్ పరిధిలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా మరమ్మతు పనులు చేశారు. కూకట్పల్లి, మియాపూర్ సబ్ డివిజన్ల పరిధిలో సుమారు 2.24 లక్షల విద్యుత్ సర్వీసులు ఉండగా సాధారణ దినాలలో సుమారు 390 లక్షల యూనిట్ల విద్యుత్‌ను వాడుతుంటారు. వేసవి కాలంలో ఈ డిమాండ్ సుమారు 500 లక్షల యూనిట్లుకు చేరుతుంది. ఎండాకాలంలో దాదాపు రెట్టింపయ్యే విద్యుత్ డిమాండ్‌తో ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లపై అదనపు భారం పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్ల వద్ద మరమ్మతు పనులను పూర్తి చేశారు. ఇప్పటికే 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్లను, 17 అడిషనల్ డీటీఆర్లను ఏర్పాటు చేశారు. 100 కేవీఏ నుంచి 160 కేవీఏల సామర్థ్యాన్ని పెంచుతూ 24 డీటీఆర్లను మార్చుతున్నారు. పాత సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద మరమ్మతు పనులు చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద స్విచ్ బోర్డులను మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తును పెంచడం (పిన్త్ రైజింగ్) పనులను ప్రారంభించారు. వేసవితో పాటుగా వర్షాకాలంలో సైతం సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ఠంగా మరమ్మతు పనులు చేశారు.
కూకట్పల్లి డివిజన్ పరిధిలో వేసవిలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నాం. గతేడాది విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకున్నాం. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. విద్యుత్ తీగలను మార్చడంతో పాటు ట్రాన్స్ఫార్మర్ల వద్ద, జంక్షన్ల వద్ద మరమ్మతు పనులు చేశాం. ఈ ఏడాది వేసవితో పాటు వర్షాకాలంలో కూడా ఎక్కడా సమస్యలు రాకుండా చర్యలు తీసుకున్నాం. వినియోగదారులకు అంతరాయంలేని విద్యుత్ సరఫరా చేస్తాం.
– డి.చక్రవర్తి,డీఈ (ఆపరేషన్), కూకట్పల్లి డివిజన్