సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): జలమండలి సిబ్బంది, అధికారులు గ్రేటర్ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. వినియోగదారులను రోజుకో రూపంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నగర వ్యాప్తంగా తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారి.. మంచినీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. కొన్ని చోట్ల మురుగు నీరు సరఫరా చేస్తూ వినియోగదారులను అవస్థల పాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా డ్రైనేజీ పైపుల లీకేజీలు, మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లడం వంటి సమస్యలు కూడా కలవరపెడుతున్నాయి.
మరికొన్ని చోట్ల లోప్రెషర్ సమస్య వేధిస్తున్నది. పలు కాలనీల్లో కేవలం అరగంట మాత్రమే సరఫరా చేస్తున్నారు. అందులోనూ దాదాపు 10 నిమిషాల పాటు గాలి వస్తుండటంతో జలమండలి సరఫరా చేస్తున్న నీరు ఏమూలకు సరిపోవడం లేదు. తప్పని పరిస్థితిలో ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. కొన్ని చోట్ల జలమండలి ట్యాంకర్లు చేరుకునే సరికి కనీసం 12 గంటల నుంచి రెండు రోజులు స మయం పడుతున్నది. దీంతో దిక్కుతోచని స్థితిలో ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసుకుంటే బిల్లు తడిసిమోపెడవుతున్నది.
మరోవైపు ఆటోమేటెడ్ మీటర్ల ఏజెన్సీలు సకాలంలో స్పందించక పోవడంతో బిల్లుల మోత మోగుతున్నది. మీటర్లు మరమ్మతులకు గురైతే రిపేర్ చేయించడానికి నెలల తరబడి సమయం పడుతున్నది. మీటర్ రీడర్లు యావరేజి బిల్లు వేయడంతో రూ. వేలల్లో వస్తున్నది. ఇలా జలమండలి వినియోగదారులు సమస్యల వలయంలో చిక్కుకుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక క్షేత్ర స్థాయి సిబ్బంది తీరు మరీ అధ్వానంగా తయారైందని ఆరోపిస్తున్నారు. ఇక చాలా చోట్ల వినియోగదారుల పై లైన్మెన్ల తీరు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైన్మెన్లపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ప్రజావాణిలోను దరఖాస్తులు అందించినా మోక్షం కలగడం లేదని వాపోతున్నారు.
జలమండలి పరిధిలోని పలు చోట్ల లైన్మెన్ల తీరు వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో నీటిని విడుదల చేయాలని కోరితే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు మండిపడుతున్నారు. నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతూ తాము నీళ్లు వదిలినప్పుడే వాడుకోవాలని బహిరంగంగానే చెబుతున్నట్లు పలు కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. శేరిలింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో లైన్మెన్లతో ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు తరచూ ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తున్నది.
తాజాగా కొండాపూర్, ప్రశాంత్‌నగర్, కొత్తగూడ, ప్రేమ్‌నగర్, అంజయ్య నగర్, సిద్ధిక్ నగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో రోజుకు 30 నిమిషాలు మాత్రమే తాగునీరు సరఫరా అవుతున్నదని ఆయా కాలనీ వాసులు చెబుతున్నారు. దీనిపై లైన్మెన్లను ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని, లైన్మెన్లపై క్షేత్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. జనరల్ మేనేజర్, మేనేజింగ్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కొండాపూర్‌లోని ప్రశాంత్‌నగర్‌లో నెలల తరబడిగా డ్రైనేజీ పైపులైన్లో లీకేజీలు ఏర్పడి ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదు చేసి నెల రోజులు దాటుతున్నా పట్టించుకోవ డం లేదని వాపోతున్నారు. జలమండలి ఎండీ క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షించి రోజుల తరబడిగా పేరుకుపోయిన తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.