సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా సాధించాలనే లక్ష్యానికి అధికారులు నీళ్లొదిలారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎస్ ఫ్లస్ ఫ్లస్) నగరంగా హైదరాబాద్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగా..ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం స్వచ్ఛ సర్వేక్షణ్-2024పై సర్వేపై కేంద్ర బృందం పర్యటన చేస్తున్నది. వచ్చే నెలలో ర్యాంకుల జాబితాను కేంద్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై ఈ బృందం అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆరు జోన్లలో మొత్తం 2,199 టాయిలెట్లలో 828 వినియోగంలో ఉండగా, 1,371 చోట్ల వృథా ఉండడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది.
టాయిలెట్ల నిర్వహణపై ఆరా
కేంద్రం నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు వచ్చి నగరంలోని టాయిలెట్లను పరిశీలించింది. అయితే అధికారులు మాత్రం వారిని తప్పుదోవ పట్టించి నీట్‌గా ఉన్న టాయిలెట్ల దగ్గరకు తీసుకువెళ్లి చూపించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. 10 రోజుల స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో భాగంగా నగరానికి వచ్చిన కేంద్ర బృందం టాయిలెట్ల శుభ్రత, వినియోగం, నిర్మాణ క్వాలిటీ చెక్ చేస్తున్నది. వీటితో పాటు గ్రేటర్లో పలు చోట్ల లూ కేఫ్‌లకు తాళాలు వేస్తూ దర్శనమిస్తున్నాయి.
డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్‌వోటీ) పద్ధతిన నగరంలో 60 లూ కేఫ్‌లను 2018 జూలైలో జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. తొలిదశలో ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ఈ కేఫ్‌లను ప్రారంభించింది. సిటీవాసుల టాయిలెట్ల సమస్య తీర్చడంతో పాటు నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడమే దీని లక్ష్యం. వీటిని 15 ఏండ్ల ఒప్పందం కింద మెస్సర్స్, ఇక్సోరా ఏజెన్సీలకు అప్పగించారు. లూ కేఫ్‌లో భాగంగా ముందు భాగంలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ షాపు వెనకే అనుకొని లగ్జరీ స్మార్ట్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. వీటిని సదరు వ్యాపారులు ఇచ్చిన అద్దెతో ఏజెన్సీలు మెయింటనెన్స్ చేయాలి. చాలా చోట్ల నిర్వహణ సరిగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
‘అర్జెంట్’ అయితే కష్టమే
టాయిలెట్ల క్షేత్రస్థాయిలో లేకున్నా వాటి పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్నట్లు, ఇందులో కొన్ని ఎజెన్సీలతో అధికారులు కుమ్మక్కై చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లలో సగానికి పైగా వినియోగంలో లేవని, కొన్ని చోట్ల గాయబ్ అయ్యాయని, బిల్లులు చెల్లింపులు మాత్రం యథావిధిగా జరుపుతుండడం పట్ల ఆరోపణలు ఉన్నాయి. చాలా చోట్ల నల్లాలు, డోర్లు, ఇతర సామగ్రి చోరీకి గురవడంతో నిరుపయోగం మారాయి. దీంతో వివిధ పనుల కోసం వచ్చే వారికి ‘అర్జెంట్’ అయితే ఎక్కడికి వెళ్లాలో అర్థం కానీ పరిస్థితి నెలకొనడం విచారకరం.