సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలో 600 మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నట్టు బడిబాటలో తేలింది. అందులో 334 మంది పిల్లలను బడిలో చేర్పించే ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు. కాగా జిల్లాలోని పాఠశాలల పరిస్థితి, బడిబాట కార్యక్రమంపై కలెక్టర్ ప్రియాంక ఆల కలెక్టరేట్లో గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, ఉప విద్యాశాఖ అధికారులు, డిప్యూటీ ఇన్స్పెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల వివరాలను కలెక్టర్కు డీఈఓ వివరించారు.
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 672 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో 481 ప్రాథమిక పాఠశాలలు, 8 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు, 183 ఉన్నత పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 25 ప్రీ-ప్రైమరీ పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు, అదనంగా 275 ప్రీ-ప్రైమరీ పాఠశాలలకు అనుమతులు మంజూరైనట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థుల ఆధార్ ప్రక్రియ 59 శాతం ఉండగా మిగతా ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేస్తామని వివరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో కృత్రిమ మేధస్సు, డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇసున్నట్లు తెలిపారు. భాషా, గణిత అభ్యాసాన్ని మెరుగుపరచేందుకు 25 పాఠశాలల్లో ఏఎక్స్ఎల్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. జిల్లాలోని 24 భవిత కేంద్రాల్లో ప్రస్తుతం 431 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని అధికారులు తెలిపారు. వారికి స్పీచ్ థెరపిస్టులు, ఫిజియోథెరపిస్టుల ద్వారా నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు 5,774 మంది ప్రత్యేక అవసరాలున్న పిల్లలను సాధారణ పాఠశాలల్లో విలీనం చేసినట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.