సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ చర్యలు చేపడుతున్నది. ఎక్కడ చెట్లు నాటడానికి అవకాశం ఉంటే అక్కడ పెద్ద ఎత్తున నాటేందుకు చర్యలు చేపడుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులు, పంచాయతీ రాజ్ రోడ్లపైనా వేల సంఖ్యలో మొక్కలు నాటేందుకు నిధులను వెచ్చిస్తున్నది. తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని పోతుగల్- బోడంపహడ్ మార్గంలో మల్టీ లేయర్ ఎవెన్యూ ఫ్లాంటేషన్‌ను ఏర్పాటుకు హెచ్ఎండీఏ సుమారు రూ.1.85 కోట్లు వెచ్చిస్తున్నది. ఈ పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు ఇటీవల టెండర్లు పిలిచామని, త్వరలోనే అర్హులైన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి మొక్కలు నాటనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. అంతేకాకుండా చేవెళ్ల నుంచి షాబాద్ మీదుగా షాద్‌నగర్ వరకు ప్రధాన రహదారి బెంగళూరు -ముంబాయి బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
10 రోజుల్లో లక్ష్యం పూర్తి చేసేలా..!
హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 63 లక్షల 93వేల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఇప్పటికే 35 లక్షల77 వేల మొక్కలను నాటారు. మిగతా మొక్కలను మరో 10 రోజుల్లో నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 61 గ్రామ పంచాయతీలు, 13 మున్సిపాలిటీలు, 17 అర్బన్ పార్క్‌లలో మొక్కలు నాటుతున్నారు. జిల్లా పరిధిలో 40 ఫారెస్ట్ బ్లాక్‌లలో 3,660 హెకార్ట విస్తీర్ణం ఉండగా.. అటవీలో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి మొక్కలు నాటుతున్నారు. విద్యార్థులు, యువతి, యువకులు మొక్కలను దత్తత తీసుకొని సంరక్షించేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా 50 పాఠశాలలను అభివృద్ధి చేయగా.. వాటి పరిసరాల్లో మొక్కల నాటి పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.