బంజారాహిల్స్, ఆగస్టు 22: నాలాలపై నిర్మించిన ఆక్రమణలు తొలగిస్తున్నామంటూ పేదల గుడిసెలను కూల్చేస్తున్న హైడ్రా అధికారులు.. నగరం నడిబొడ్డున బడాబాబులు చేస్తున్న ఆక్రమణలను పట్టించుకోరా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 1లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నం. 5లోని జీహెచ్ఎంసీ పార్కు నుంచి వెళ్తున్న వరదనీటి నాలాను ప్లాట్ నంబర్ 65, ప్లాట్ నంబర్ 49(సీ)కి మధ్యన ఆక్రమించుకున్నారు.
ఈ నాలాల మీదనే దర్జాగా గదుల నిర్మాణం చేసి అద్దెలకు ఇచ్చారు. ప్లాట్ నంబర్ 49(సి)కి చెందిన భవనానికి సంబంధించిన భారీ ప్రహరీని నాలా బఫర్ జోన్లో నిర్మించారు. ఈ మొత్తం వ్యవహారంపై నెలరోజుల కిందట ‘నమస్తే’లో కథనం ప్రచురించగా జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు, హైడ్రా అధికారులు పరిశీలించారు.
వారంరోజుల్లో నాలా ఆక్రమణలను తొలగిస్తామని అధికారులు చెప్పారు. అయితే నెలరోజులు గడిచినా ఇప్పటిదాకా నాలా ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాలాను కబ్జా నుంచి విముక్తి చేయించాలని, బఫర్ జోన్లో ఏర్పాటు చేసిన ప్రహరీని కూల్చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.