సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఇటీవల హైదరాబాద్ నగరశివారులో ఓ హైరైజ్డ్ బిల్డింగ్‌కు కరెంట్ కనెక్షన్ కోసం ఐప్లె చేసుకోగా అందుకు రూ.9.73లక్షలు అవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఆ అంచనా విషయంలో చాలా ఎక్కువైనట్లు బిల్డింగ్ యజమాని దగ్గర ఎలక్ట్రిషియన్ చెప్పి తాము తమకు తెలిసిన కాంట్రాక్టర్‌తో మాట్లాడతానని చెప్పి అతనితో మాట్లాడగా అతను సదరు అధికారితో మాట్లాడి రూ.7.16 లక్షలకు ఓకే చేయించారు. తన బిల్డింగ్‌కు అంతఖర్చు ఎందుకంటూ ఆ యజమాని తనకు తెలిసిన అధికారితో అంచనా వేయిస్తే అది కాస్తా రూ.4.45 లక్షలే అవుతున్నట్లు చూపించింది. దీంతో డిస్కం ఉన్నతాధికారులలో ఒకరికి ఈ విషయం చెప్పడంతో ఆయన ఆ ప్రాంత అధికారిని పిలిచి మందలించి వెంటనే పనిచేయాలని పురమాయించినట్లు సమాచారం.
అయితే కాంట్రాక్టర్‌ను సైతం ఆ అధికారి పిలిపించి ఆరా తీయగా స్థానిక అధికారి, కాంట్రాక్టర్ ఇద్దరూ కలిసి చాలా పనులు చేసుకున్నట్లు చెప్పినట్లు తెలిసింది.
శుక్రవారం గచ్చిబౌలి ఏరియాలో ఓ ఇంటికి 11కేవీ వైరింగ్ మార్చడానికి రూ. 30వేలు లంచం డిమాండ్ చేసిన జూనియర్ లైన్మెన్ శ్రీకాంత్‌గౌడ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గచ్చిబౌలి డివిజన్లో ఓ వ్యక్తి ఇంటికి 5 కేవీ నుంచి 11 కేవీకి వైరింగ్ మార్చడానికి లంచం అడిగి రూ. 11వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇటీవల హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలోని అపార్ట్మెంట్లలో రెండు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు రూ. 75వేల లంచం అడిగి, రూ.50వేలు లంచం తీసుకుంటూ గచ్చిబౌలి ఏడీఈ ఏసీబీకి పట్టుబడ్డారు.
టీజీఎస్పీడీసీఎల్లోని గ్రేటర్ శివారు ప్రాంతాల డివిజన్లలో ఒకవైపు వినియోగదారులను ఇబ్బంది పెట్టడం, దరఖాస్తు చేసిన వారిని ఎస్టిమేషన్ల పేరుతో భయపెట్టడం, వారిని సెట్ చేయడానికి ముందుగానే కాంట్రాక్టర్లకు సమాచారమివ్వడం వంటివి రొటీన్‌గా మారింది. ఇటీవల గచ్చిబౌలి, ఇబ్రహీంబాగ్, పటాన్చెరు వంటి ప్రాంతాల్లో విద్యుత్ అధికారులు, సిబ్బందిపై వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న సంఘటనలు వినియోగదారులు చేస్తున్న ఫిర్యాదులకు అద్దంపడుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ శివారుప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, హైరైజ్డ్ బిల్డింగులకు అధికలోడు సామర్థ్యంలో విద్యుత్ కనెక్షన్ ఇచ్చే సమయంలోనే అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కనెక్షన్ కోసం దరఖాస్తు చేసిన సమాచారం. ఇతర వివరాలు ఇంజినీర్ల ద్వారా కాంట్రాక్టర్లు తీసుకుంటారు. అసలు కనెక్షన్ ఇవ్వడానికి ఎంత దూరంలో విద్యుత్ లైన్ ఉంది..కనెక్షన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఇవ్వడానికి అయ్యే ఖర్చు ఎస్టిమేషన్ ఇంజినీర్లు ఇవ్వాలి. ఈక్రమంలో ఇంజనీర్లు భారీగా అంచనాలు వేయడంతో దరఖాస్తుదారులు కొంచెం తగ్గించమని అడుగుతున్నారు. ఈక్రమంలో కాంట్రాక్టర్లు ఎంటరై కొంత తగ్గించాలంటూ కోరడం, ఇంజినీర్లు ఒప్పుకోవడం.. ఆ తర్వాత వారు చెప్పిన విధంగా చేయించుకోవడం రొటీన్‌గా జరుగుతోంది.
తాము చెప్పిన కాంట్రాక్టర్ లేదా తమవారితో పనిచేయించుకోకపోతే కనెక్షన్ నెలల తరబడి ఆలస్యమవడం ఖాయమని విద్యుత్‌శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. సీఎండీ స్థాయిలో ఫైల్స్ పూర్తి చేయాలని చెప్పినా.. వారి టేబుల్ మీదకు రావాల్సింది ఇవ్వకపోతే ఆ ఫైల్ కదలదని, కనెక్షన్ విషయంలోనూ వారిదేందో తమకు వచ్చిన తర్వాతనే మిగతా పనులు జరుగుతాయని తమ అధికారుల గురించి నగరశివారులోని పలు డివిజన్ల సిబ్బంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
విద్యుత్‌శాఖ సిబ్బంది ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలంటూ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఫోన్ ఏర్పాటు చేశారు. గత 8 నెలల్లో 63 మంది ఉద్యోగులపై వినియోగదారులు ఈ ఫోన్లో సమాచారం అందించారు. వారందరిపైన విచారణ చేపట్టినట్లు ఉన్నతాధికారులు చెప్పారు. అయితే ఇందులో 19 మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని వారు పేర్కొన్నారు. లంచాలు వసూలు చేస్తూ పట్టుబడిన ఉద్యోగులపై ఎస్పీడీసీఎల్ నామమాత్రపు చర్యలు తీసుకుంటుండడంతో మిగతావారు కూడా వసూళ్లకు తెగపడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్, ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, పటాన్చెరు, రామచంద్రాపురం, హైటెక్‌సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో అక్రమంగా వసూళ్లు చేసేందుకు అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడానికి అధికారులు, సిబ్బంది ఎంత ఖర్చైనా సరే అంటూ తమ గాడ్ ఫాదర్లను, సంస్థలో పనిచేస్తున్న కొందరు పైరవీకారులను పట్టుకుని పోస్టింగులు ఇప్పించుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కొన్ని డివిజన్లలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు సిండికేట్‌గా ఏర్పడి తామున్న కీలకస్థానాలను ఆసరాగా చేసుకుని పక్క డివిజన్లు, తమతో పనిచేసిన అధికారులు, సిబ్బందిని కూడా వాడుకుంటూ ఫైల్స్ చేయిస్తున్నారని డిస్కం అంతర్గత విచారణలో తేలింది.
ఎన్నిరోజుల గడువు లోపు పూర్తిచేయాలన్న అంశంపై ఎవరూ తనిఖీ చేయకపోవడం ఈ లంచాల వసూలుకు కారణమవుతోంది. ఈ వ్యవహారంలో ఇంజినీర్లకు బదులు కాంట్రాక్టర్లు బినామీలుగా పనిచేస్తున్నారని డిస్కం చేపట్టిన విచారణలో తేలింది. అయినా ఆయా అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు వెనకడుగు వేస్తున్నారంటే వారి వెనక పెద్ద పెద్ద అధికారులు, పొలిటిషియన్స్ ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దక్షిణ డిస్కంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు సంబంధించిన వివరాలు సాక్ష్యాధారాలతో సహా సంస్థ ఉన్నతాధికారి వద్ద ఉన్నాయని, దీనిపై చర్యలకు గట్టిమంత్రి అడ్డుపడుతున్నట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.