నగరంలో ఫేక్ ఎన్వోసీలు కలకలం సృష్టించాయి. క్యూర్ పరిధిలో పలు కాలేజీలు ఫేక్ ఫైర్ ఎన్వోసీలు సమర్పించారంటూ చెలరేగిన దుమారం ఇప్పుడంతా గప్‌చుప్‌గా మారింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేశారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో అసలు సూత్రధారులు పోలీసులకు దొరికారా అనేది చర్చనీయాంశమైంది. హైడ్రా ఎన్వోసీలు జారీ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని ఇచ్చిందనేది మాత్రం అధికారులు రహస్యంగానే ఉంచుతున్నారు. కళాశాలలు సమర్పించిన ఫైర్ సర్టిఫికెట్లలో నకిలీవంటూ ఆరోపణలు వచ్చిన 145 సర్టిఫికెట్లను పరిశీలించి వాటిలో 52 నకిలీలుగా తేల్చారు. రెండేళ్లుగా హైడ్రా ఎన్ని ఫైర్ ఎన్వోసీలు ఇచ్చిందనేది నేటికీ స్పష్టత రాలేదు.
-సిటీబ్యూరో, ఆగస్టు15 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, ఆగస్ట్ 15 (నమస్తే తెలంగాణ):గత నెల 4వ తేదీన లేక్ పోలీసు స్టేషన్లో హైడ్రా అడిషనల్ కమిషనర్ పాపయ్య ఫేక్ ఎన్వోసీలపై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో 8కళాశాలలు నకిలీ పత్రాలు ఇచ్చాయంటూ ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ కోర్ రీజియన్‌కు పరిధిలో 142 జూనియర్ కళాశాలలు సమర్పించిన ఫైర్ ఎన్వోసీలపై అనుమానం రావడంతో బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ఆ సర్టిఫికెట్లను హైడ్రాకు పంపారు. అందులో 90 అసలువని, మిగతా 52 నకిలీవని హైడ్రా ధ్రువీకరించింది. హైడ్రా కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే కమిషనర్ పేరు మీద దొంగ సంతకాలతో ఫేక్ ఎన్వోసీలు సృష్టించారంటూ పాపయ్య మొదట ఎనిమిది కళాశాలలపై ఫిర్యాదు చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. గత నెలలో అంటే సుమారు నెల పదిరోజుల క్రితం ఫిర్యాదు ఇవ్వడం, సరిగ్గా నెలరోజులకు ఈ వ్యవహారం బయటకు వచ్చేలా లీకులు ఇవ్వడం, ఆ తర్వాత మళ్లీ షరామామూలే అన్నట్లు గప్‌చుప్‌గా ఉండడం వెనక అంతర్యమేంటంటూ నగరంలో చర్చ జరుగుతుంది. ప్రధానంగా హైడ్రా రంగనాథ్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నుంచి జనం దృష్టి మరల్చేందుకే నకిలీ ఎన్వోసీల వ్యవహారం బయటపెట్టారంటూ హైడ్రాలో మాట్లాడుకుంటున్నారు.
కమిషనర్ ఎందుకు మాట్లాడరు..
అసలు నకిలీ ఎన్వోసీలు ఎన్ని ఉన్నాయి.. ఏయే డిపార్ట్మెంట్లకు సంబంధించి హైడ్రా జారీ చేసింది. ఆయా డిపార్ట్మెంట్లు రెండు సంవత్సరాలుగా ఎన్నిటికీ పర్మిషన్లు ఇచ్చాయనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. హైడ్రా నుంచి జారీ అయిన ఫైర్ సర్టిఫికెట్లు ఆసుపత్రులు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, నాన్హైరైజ్డ్ బిల్డింగులు.. ఇలా పలు భవనాలకు ఇచ్చారు. అసలు తాము ఎన్ని సర్టిఫికెట్లు ఇచ్చాం.. ఎవరెవరికి ఇచ్చామనేది మాత్రం హైడ్రా బయటపెట్టడం లేదు. కేవలం ఈ సర్టిఫికెట్ల వ్యవహారం బయటకు వచ్చి రెండు మూడురోజుల హడావిడి తర్వాత మరుగున పడుతుండడంతో అసలు సూత్రధారులు ప్రత్యేకించి హైడ్రాలోనే ఉన్న ఇంటిదొంగలు బయటపడకుండా వ్యవహారం చక్కబెట్టుకున్నట్లు తెలిసింది. తాను ప్రతి విషయంలో పారదర్శకంగా ఉంటానంటూ చెప్పుకునే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ నకిలీ ఎన్వోసీల విషయంలో స్పందించడం లేదు. తన ప్రమేయం లేకుండా తన సంతకం ఫోర్జరీ చేసిన వ్యవహారంలో రంగనాథ్ సీరియస్‌గా దృష్టి పెట్టకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని నగరానికి చెందిన కొందరు విద్యావంతులు అంటున్నారు. ముఖ్యంగా సర్టిఫికెట్లు ఎన్ని జారీ చేశారు, ఎవరెవరికీ ఇచ్చారు, మొత్తం సర్టిఫికెట్లలో నకిలీవి ఎన్ని అనేది ఎందుకు తేల్చడం లేదని, పోలీసు ఆఫీసరుగా పనిచేసిన రంగనాథ్‌కు ఈ కేసు తేల్చడం పెద్ద కష్టమేం కాకపోయినా నకిలీలను పట్టించుకోవడం లేదు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.
సూత్రధారులెవరో తేల్చలేదు..
పోలీసులు విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో హైడ్రా జారీ చేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. మరి వీటిని ఇచ్చిందెవరు.. ఈ స్కాంకు సూత్రధారులెవరనేది ఇప్పటికీ తేల్చలేదు. ఏదైనా కేసు విచారణ జరిపే సమయంలో నకిలీలు ఉన్నారని తెలిస్తే అదీ ఒక ఐపీఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేశారని తెలిసిన తర్వాత కూడా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై హైడ్రా ఉద్యోగులే ఆశ్చర్యపోతున్నారు. చిన్న సంఘటన జరిగితేనే చాలా యాక్టివ్‌గా స్పందించే రంగనాథ్ ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదు.. అసలు ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందా అనే చర్చ కూడా జరుగుతోంది. సూత్రధారులను కనిపెట్టే క్రమంలో పోలీసులపై కూడా కొంతమేరకు ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. వారు గుర్తించిన వారిలో కొందరు హైడ్రా అధికారులు కూడా ఉండడంతో ఈ వ్యవహారాన్ని మొత్తం ఇంటర్బోర్డువైపు తిప్పేసి తమదేం లేనట్లుగా హైడ్రా వ్యవహరిస్తోంది. కేవలం కళాశాలలేనా, ఇంకా ఏయే భవనాలకు ఇచ్చారో చెప్పకుండా నకిలీల వ్యవహారం తమకు అంటకుండా కొందరు హైడ్రాలోని కీలక అధికారులు చేస్తున్న లోపాయికారి వ్యవహారాలు కమిషనర్ దృష్టి పెడితే బయటపడే అవకాశముందంటూ హైడ్రాలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు ఏజెన్సీలు హైడ్రా అధికారులతో అంటకాగి ఈ నకిలీల సృష్టికి మూలమయ్యారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫైర్ ఎన్వోసీలు తీసుకోవాలంటే హైడ్రా పెట్టిన నిబంధనలు చాలా కఠినతరంగా ఉండడంతో నకిలీలు తయారయ్యాయని, వీటి విషయంలో ఏసీబీతో విచారణ జరిపించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వస్తోంది.