శేరిలింగంపల్లి, జూన్ 21 : గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ఏర్పాటు చేసిన అల్పాహారం కేంద్రం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. అల్పాహారం కోసం అందజేసిన టోకెన్లతో టిఫిన్ కోసం ఒక్కసారిగా జనం ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో చిక్కుకొని గాంధీ నర్సింగ్ విద్యార్థి స్వల్ప అస్వస్థతకు గురైంది.
గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా డే నిర్వహించారు. యోగా డే వేడుకల అనంతరం స్టేడియం ప్రాంగణంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. టిఫిన్ చేసేందుకు టోకెన్ సిస్టం పెట్టారు. అప్పటికే టిఫిన్ అయిపోవడంతో మళ్ళీ మరో ట్రాలీలో అల్పాహారం తీసుకొచ్చారు. కాగా టిఫిన్ కోసం టోకెనులతో వేచి ఉన్న వారు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అల్పాహారం ట్రాలీ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో గాంధీ ఆస్పత్రిలో నర్సింగ్ కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్న నజిమా(19) కింద పడిపోయింది. టిఫిన్ కోసం ఎగబడిన వారు నజిమాను మెడ, కడుపుపై తొక్కడంతో అస్వస్థతకు గురైంది. గమనించిన అధికారులు వెంటనే నజీమను అంబులెన్స్‌లో కొండాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అంతరం ఆమెకు వైద్య సేవలు అందించారు. అక్కడ వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అనురాగిని రెడ్డి ఆమెను పరామర్శించి ఆరోగ్యం విషయాలను ఆడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. కాసేపటికి ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించామని, అక్కడ సీటీ స్కాన్ చేస్తే ఏదైనా ఇబ్బంది ఉంటే తెలిసే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. స్టేడియంలో యోగా డే వేడుకల్లో సరైన వసతులు లేకపోవడం, ప్రణాళిక బద్దంగా అల్పాహారం అందజేయక పోవడం కారణంగా తొక్కిసలాట జరిగిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.