సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన నర్సు కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఆమెను బీహార్ వాసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బీహార్‌కు చెందిన సైనా ఉల్లా అనే వ్యక్తి కిటికీ నుంచి నర్సు గదిలోకి దూకి ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో బాధితురాలు ప్రతిఘటించగా, నిందితుడు ఆమె గొంతు నొక్కి కేకలు వేయకుండా అడ్డుకోవడంతో నర్సు మృతిచెందినట్లు వారు పేర్కొన్నారు.
ఘటనకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన యువతి ఏడు నెలల కిందట మహేశ్వరంలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడే ఉన్న ఒక ఆసుపత్రిలో నర్సుగా చేరి అదే ఆసుపత్రికి చెందిన గదిలో ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం గదిలోకి వెళ్లి మళ్లీ ఆసుపత్రికి తిరిగి రాకపోవడంతో యాజమాన్యం ఆమెకు ఫోన్ చేసింది. అయినా స్పందించకపోవడంతో ఆమె ఉంటున్న గదికి సిబ్బందిని పంపి చూడగా, గది తలుపులు లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో కిటికీ సందులో నుంచి చూడగా ఆమె నేలపై పడి ఉంది. ఆసుపత్రి సిబ్బంది తలుపులు విరగ్గొట్టి లోపలకు వెళ్లి చూడగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు సంఘటనాస్థలానికి క్లూస్ టీమ్‌తో చేరుకుని పరిశీలించారు. శరీరంపై గాయాలు గమనించి.. ఆమె మృతిపై అనుమానం ఉందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతురాలి కుటుంబసభ్యులు పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు పారిపోతున్న సమాచారం వచ్చిన వెంటనే అతడిని పట్టుకుని విచారించగా, సైనా ఉల్లా తాను నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. సైనా ఉల్లా ఒక రియల్ఎస్టేట్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారని పోలీసులు చెప్పారు. కాగా, యువతి మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఉస్మానియా మార్చురీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.