అబిడ్స్, డిసెంబర్ 30 : అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే స్టాల్ల కేటాయింపు పూర్తి కాగా నిర్వాహకులు నిర్మాణ పనులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని స్టాల్లు ప్రారంభమయ్యేలా ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సుఖేశ్రెడ్డి, కార్యదర్శి బీఎన్ రాజేశ్వర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌కు 20 లక్షల పై చిలుకు సందర్శకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నగర నలుమూలలతో పాటు ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు చెందిన ప్రజలు తరలి వస్తారు.
వాహనాలను పార్క్ చేసుకునేందుకు ఉచిత పార్కింగ్ ప్రదేశాలను ఎంపిక చేసి ఆయా పార్కింగ్ ప్రదేశాల్లో ఎగ్జిబిషన్ సొసైటీ వలంటీర్లను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు. అంతర్గత భద్రతా చర్యలతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది, సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసేందుకు గాను చర్యలు తీసుకుంటున్నారు. లక్షన్నర లీటర్ల సామర్థ్యంతో కూడిన రెండు నీటి ట్యాంకులు, ఫైర్ హైడ్రెంట్లను సిద్ధంగా ఉంచుతున్నారు. రెండు ఫైరింజన్లు, రెండు బుల్లెట్లపై అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా అగ్నిమాపక శాఖ వారు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపనుంది. మెట్రో రైలు వేలలను కూడా పొడిగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు.