NTR | రవీంద్రభారతి,ఫిబ్రవరి10 : సినీ నటుడు మురళీమోహన్ను ఎన్టీఆర్ పురస్కారం వరించింది. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలను పురస్కరించుకుని మైహోమ్ అవతార్ సీనియర్ సిటిజన్స్ వెల్పేర్ అసోసియేషన్(కల్చరల్ వింగ్) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్‌కు పురస్కారం అందజేశారు.
ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథం కలిగిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ పురస్కారం అందుకోవడానికి సినీనటుడు మురళీమోహన్ అన్ని విధాల అర్హుడని పేర్కొన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఐక్యతో కోసం ఎంతో కృషిచేశారని.. ఆయన అడుగు జాడల్లో తాము నడుస్తున్నామని చెప్పారు.
మురళీమోహన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తన అభిమాన ఆరాధ్య దైవమని అన్నారు. ఆయన కుమారుడు రామకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. సభకు ముందు సినీ జర్నలిస్టు ఏస్వి రామరావు రూపొందించిన విశ్వవిజేత ఎన్టీఆర్ జీవిత లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో జె.రాధాకృష్ణ, ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.