కంటోన్మెంట్, నవంబర్ 20: క్రిస్టియన్ మైనార్టీలంతా సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ వైపే ఉన్నారని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ స్పష్టం చేశారు. క్రిస్టియన్లకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ వచ్చిన తర్వాత క్రిస్టియన్లకు అన్ని విధాల అండగా ఉంటున్నారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు ప్రశాంతంగా ఉన్నాయని, ఇతర పార్టీలు తమకు అవసరం లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్.. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌లోని కేజేఆర్ గార్డెన్స్‌లో క్రిస్టియన్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్టీఫెన్ సన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితతో పాటు ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి ఎంఎన్. శ్రీనివాస్, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యులు పాండు యాదవ్‌తోపాటు నేతలు దేవేందర్, టీఎన్ శ్రీనివాస్, నర్సింహ ముదిరాజ్, ఖదీరవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత మాట్లాడుతూ.. అన్ని వర్గాలు కేసీఆర్ పాలననే కోరుకుంటున్నాయని చెప్పారు.
క్రిస్టియన్ సమాజమంతా తనకు ముక్తకంఠంతో మద్దతు పలకడం మరిచిపోలేనన్నారు. అందరూ నిండు మనసుతో తనను దీవించి, భారీ మెజార్టీతో గెలిపించాలని లాస్యనందిత కోరారు. మరోవైపు ఎమ్మెల్సీ ప్రభాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితను సొంత బిడ్డలా భావించి గెలిపించాలని కోరారు. అన్ని పార్టీలు తిరిగొచ్చిన బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాకుండా ఓడించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పాస్టర్లు బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత, నామినేట్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో పాటు ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎంఎన్ శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు జులియన్, పాస్టర్ మనోహర్, పాస్టర్ అరుణ్ విక్టర్, పాస్టర్ మేరీ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.