Vanasthalipuram | వనస్థలిపురం, జూలై 5 : వీధి దీపాల నిర్వహణ లోపంతో రాత్రిపూట కొన్ని ప్రాంతాలు అంధకారంగా మారిపోతున్నాయి. సమస్య వచ్చిన చోట నాలుగైదురోజులైనా పరిష్కారం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు మనది ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్నా రాత్రిపూట అంధకారం వెక్కిరిస్తోంది. గతంలో వీధి లైట్లలో సమస్య వస్తే గంటల్లో పరిష్కారమయ్యేది, కానీ ఇప్పుడు రోజులు గడిచినా సమస్య పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో జీహెచ్ఎంసీ నిర్వహణా లోపం కొట్టోచ్చినట్టు కనబడుతోంది.
అప్పుడలా… ఇప్పుడిలా…
గతంలో ఈఈఎస్ఎల్ అనే సంస్థ నిర్వహణా బాధ్యతలు చూసుకునేది. జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ విభాగం మాత్రం విద్యుత్ సరఫరా బాధ్యతలు చూసుకునేది. కొత్త లైట్లు వేయాలన్నా, పాత లైట్లను మార్పు, మరమ్మతులు సదరు సంస్థ చకచకా చక్కబెట్టేది. విద్యుత్ సరఫరా లోపాలు, స్తంభాల ఏర్పాటు తదితర అంశాలను జీహెచ్ఎంసీ చూసుకునేది. దీంతో సమస్య సత్వరమే పరిష్కారం కావడం జరిగేది. కానీ సదరు సంస్థకు రూ.కోట్లలో జీహెచ్ఎంసీ బకాయి ఉండడంతో దానిని చెల్లించాలని సంస్థ పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో ఎప్రిల్ 30న ఈఈఎస్ఎల్ కాంట్రాక్టు ముగియడంతో జీహెచ్ఎంసీ కొత్త సంస్థ కోసం ప్రతిపాదనలు కోరింది. అప్పటినుంచి సమస్య మొదలయ్యింది. నిర్వహణ, విద్యుత్ సరఫరా బాధ్యతలు ఎలక్ట్రికల్ విభాగంపై పడడంతో అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించలేకనే కొత్త టెండర్లకు వెళ్తున్నారన్న విమర్శలూ లేకపోలేదు.
ఉపాధి పోయింది… అంధకారమయ్యింది
ఈఈఎస్ఎల్ సంస్థ కాంట్రాక్టు రద్దుకాగానే సంస్థలో పనిచేస్తున్న సిబ్బందినంతా తీసేసింది. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దానికి పరోక్షంగా జీహెచ్ఎంసీ కారణమయ్యింది. ఇటు ప్రజలకేమయినా మంచి జరిగిందా అంటే అదీలేదు. రోజుల తరబడి అంధకారంలో మగ్గుతున్నారు. జీహెచ్ఎంసీ, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వలన నష్టాలు తప్ప ఎవరికీ ప్రయోజనం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై సరైన విధంగా స్పందించాలని, తమకు ఉపాధి పునరుద్ధరించాలని బాధిత ఉద్యోగులు కోరుతున్నారు. నిర్వహణను మెరుగపర్చి సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.