GHMC | సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు, రహదారుల్లో వీధి దీపాలు లేక చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. 5.48 లక్షల వీధి దీపాలలో దాదాపు 20 శాతానికి పైగా వీధి దీపాలు వెలగడం లేదు. ముఖ్యంగా గత రెండు రోజులుగా అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్కు, బసవతారకం క్యాన్సర్ దవాఖానా నుంచి కేబీఆర్ పార్కు ప్రధాన ద్వారం వరకు రాత్రి సమయాల్లో వీధి లైట్లు వెలగడం లేదు. దీంతో వాకర్లు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ చీకట్లకు గల కారణం సదరు నిర్వహణ ఎజెన్సీ బల్దియా ఇవ్వాల్సిన బకాయిలపై పోరుబాట పట్టడమే. తమకు బల్దియా నుంచి రూ. 100కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందంటూ గడిచిన 15 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. దీంతో వీధి లైట్ల నిర్వహణ గాడి తప్పింది.
గ్రేటర్లో సుమారు 5.48 లక్షలకు పైగా వీధి దీపాలను నిర్వహించే బాధ్యతలను 2018 ఏప్రిల్ మాసం నుంచి ఏడేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)కు అప్పగించిన సంగతి తెలిసిందే. వీటిలో పది శాతం స్ట్రీట్ లైట్లు టైమర్ల సహాయంతో ఆటోమెటిక్‌గా వెలగడం, ఆటోమెటిక్‌గా ఆఫ్ అవుతుండగా, మిగిలిన వాటన్నింటిని మ్యాన్‌వల్‌గానే నిర్వహిస్తున్నారు. అయితే నిర్వహణలో ఈఈఎస్ఎల్పై తరచూ కార్పొరేటర్లు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు.
ఒకానొక దశలో గత కమిషనర్లు సైతం మందలించారు. ముఖ్యంగా వీధి దీపాల మరమ్మత్తుల పాలైనప్పుడు మార్చాల్సిన లైటు, ఇతర పరికరాలను ఎప్పటికీ సుమారు 15 శాతం రిజర్వ్ పెట్టుకోవాలన్న నిబంధన ఒప్పందంలో ఉన్నప్పటికీ దానిని ఈఈఎస్ఎల్ ఏ మాత్రం ఆమలు చేయకపోవడం, కొత్తగా పది కాలనీలకు విద్యుత్ సరఫరా మంజూరయినప్పటికీ స్తంభాలు వేసి, కరెంట్ తీగలను లాగడంతో పాటు వీధి దీపాలను బిగించాల్సిన ఈఈఎస్ఎల్ పట్టించుకోకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో తరచూ స్ట్రీట్ లైట్లు వెలగక ఇబ్బందులు పడుతున్నామంటూ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. వాస్తవంగా గ్రేటర్లో వీధి లైట్లు 5.48 లక్షలు ఉండగా రోజూ 98శాతం వెలగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 80 శాతం లోపే వెలుగుతున్నట్లు ఫిర్యాదుల ఆధారంగా కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. అందుబాటులో నిత్యం 27,500 (5శాతం) ఉండాలి. కానీ కేవలం మూడు వేలు మాత్రమే ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే సదరు ఎజెన్సీ ప్రతినిధులతో కమిషనర్ ఇలంబర్తి సమావేశమై నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.