సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ) : విద్యను వ్యాపారంగా మలిచే ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకునేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాంలు, బెల్టులు, స్టేషనరీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. అధిక ధరలతో ప్రతి విద్యాసంవత్సరంలో సొమ్ము చేసుకుంటున్న స్కూళ్ల ఆగడాలకు బ్రేకులు వేయడానికి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, డిప్యూటీ స్కూల్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీ బృందాలు సిద్ధమయ్యాయి. ప్రత్యేక కౌంటర్లు తెరిచి వ్యాపారం చేసే స్కూళ్లను గుర్తించి.. కేసులు నమోదు చేయడం, స్కూల్ అనుమతి రద్దు చేయడం వంటి తీవ్ర చర్యలు కూడా తీసుకోనున్నారు. ఎటువంటి స్కూళ్లల్లోనైనా విద్యకు సంబంధించిన సామగ్రి విక్రయించడానికి వీలు లేదని జిల్లా డీఈవో రోహిణి స్పష్టం చేశారు.
నగరంలో సుమారు 8వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయి. ప్రతి ఏడాది తల్లిదండ్రులకు పిల్లలను చదివించడం కత్తిమీద సాములా మారింది. ఎల్కేజీ అడ్మిషన్ డొనేషన్‌కు సైతం లక్షలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇక ఫీజులు లక్షల్లో ఉంటే… ఇంతటితో ఆగకుండా కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు పిల్లలు ధరించే యూనిఫాంలు, రాసుకునే పెన్నులు, చదివే పుస్తకాలు, ఇతర స్టేషనరీ అంతా తామే అమ్ముతామని తమ దగ్గర మాత్రమే కొనుగోలు చేయాలని హుకుం జారీ చేస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు వేల రూపాయలు గుమ్మరించి.. యాజమాన్యాలు కొనుగోలు చేయమన్న ప్రతీది కొనాల్సిన పరిస్థితి వస్తున్నది. జూన్ వచ్చిందంటే పిల్లల చదువు, పుస్తకాల ఫీజులు గుర్తొచ్చి బెంబేలెత్తుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు స్కూళ్ల ఆగడాలను కొంతనైనా అడ్డుకట్ట వేసేందుకు అధికారులు దృష్టి సారించడంపై పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో 4వ తేదీలోపు 11లక్షల పుస్తకాలు, 4.47 లక్షల నోట్బుక్స్ల పంపిణీ పూర్తవ్వాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టర్ ఆలియా ప్రభుత్వ పాఠశాలలో పనుల పురోగతిని పరిశీలించారు. జూన్ 10 నాటికి అన్ని పాఠశాలలు సకల హంగులతో సిద్ధంగా ఉండేలా పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
చదువును అందించే విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకూడదు. స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాం, బెల్టులు, స్టేషనరీ ఏవీ కూడా విక్రయించడానికి వీలు లేదు. మా దృష్టికి వచ్చిన ప్రతి స్కూల్‌పై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మండల స్థాయిలో ప్రత్యేక టీంలను రంగంలోకి దించాం. జూన్ 1 నుంచే కొన్ని స్కూళ్లు పుస్తకాల విక్రయానికి సిద్ధమవుతున్నట్టు కొన్ని ఫిర్యాదులు అందాయి. వాటిపై మా నిఘా ఉంటుంది. కచ్చితంగా ఆ స్కూళ్లపై నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల సూచనలతో చర్యలు తీసుకుంటాం.
ప్రైవేటు స్కూళ్లల్లో పుస్తకాలు, స్టేషనరీ విక్రయించడం నేరం. నిబంధనలు అతిక్రమిస్తే స్కూల్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం. అవసరమైతే 20 లక్షల వరకు జరిమానా విధిస్తాం. నిబంధనలు పాటించాలి. విద్యాసంస్థలు ఎప్పుడూ లాభపేక్ష లేకుండా కొనసాగాలి. జిల్లాలో ఏ స్కూల్లోనైనా పుస్తకాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.