సిటీబ్యూరో, జూలై29, (నమస్తే తెలంగాణ): బస్తీ దవాఖానల్లో సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉన్నవాటిని కూడా సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమవుతుంది.
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైద్యరంగాన్ని కంటికిరెప్పలా కాపాడగా.. రేవంత్ పాలనలో పట్టించుకునేవారే కరువయ్యారు.రాష్ట్ర వ్యాప్తంగా 500, గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 250 బస్తీ దవాఖానలు ఉన్నాయి. ప్రతి 10 వేల జనాభాకు ఒకటి చెప్పున బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, సహాయ సిబ్బంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు.
జీతాల గురించి అధికారులను అడిగితే కేంద్రప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంటుందని, నిధులు మంజూరు కాలేదంటూ కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. జ్వరం, జలుబు, విరేచనాలు, వాంతులు, చిన్నపాటి ప్రమాదాలు జరిగిన నగరంలోని రోగులు బస్తీ దవాఖానల్లో చేరి చికిత్స తీసుకుంటారు. పేదలకు నిత్యం వైద్యసేవలు అందుబాటులో ఉండే విధంగా నాడు కేసీఆర్ సర్కార్ బస్తీ దవాఖానలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించకపోగా నెలలపాటు పెండింగ్లో పెడుతుండటం గమనార్హం. వేతనాలు రాకున్నా కూడా నిత్యం దవాఖానలకు వచ్చి వైద్యమందిస్తున్నామంటున్నారు.
అద్దె చెల్లించేందుకు అప్పులు..
నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉంచడం మూలంగా ఇంటి అద్దెలు చెల్లించేందుకు, ఈఎంఐలు కట్టేందుకు అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఒంటరి మహిళలు కుటుంబాన్ని పోషించేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. జీతాల కోసం పై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా బడ్జెట్ లేదంటూ పలువురు మెడికల్ అధికారులు తెలుపడం గమనార్హం. ప్రతి రోజు దవాఖానకు వచ్చేందుకు ఆటో చార్జీలకు కూడా తమ వద్ద డబ్బులు లేవని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని అమలు చేయడంలో బస్తీ దవాఖానల్లో పనిచేసే సిబ్బంది పాత్ర ముఖ్యమైంది. వేతనాలు సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.