Indian Students | బంజారాహిల్స్ : ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత విద్యార్థులకు అమెరికాలో అవకాశాలు తగ్గుతాయనే వార్తలు అవాస్తవమని.. నైపుణ్యం ఉన్న వారికి మంచి అవకాశాలు నిరంతరం ఉంటాయని యూఎస్ కాన్సులేట్ రాజకీయ ఆర్థిక సలహాదారుడు ఫ్రాంక్ టెలుటో తెలిపారు. బంజారాహిల్స్‌లోని హయత్ ప్లేస్‌లో శుక్రవారం గ్లోబల్ ట్రీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమెరికన్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాంక్ టెలుటో మాట్లాడారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చే విద్యార్థుల కోసం ప్రస్తుతం ఉన్న వీసా నిబంధనలు యథాతధంగా ఉంటాయన్నారు.
కేవలం పార్ట్ టైం ఉద్యోగాలకు సంబంధించి మాత్రం కొన్ని మార్పులు చేశారన్నారు. విదేశీ విద్యార్థులకు ఎప్పుడూ అమెరికాలో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఎఫ్ఎన్, ఓపీటీ, సీపీటీ తదితర నిబంధనలు ట్రంప్ ప్రభుత్వం వచ్చాక మారలేదన్నారు. ట్రంప్ తీసుకున్న మేకిన్ అమెరికా నినాదంతో నైపుణ్యం కలిగిన వారికి మంచి అవకాశాలు ఉంటాయని వివరించారు. ఈ సందర్భంగా అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ, వీసా, కోర్సులు, ఫీజుల వివరాలనును ఆయా యూనివర్సిటీ ప్రతినిధులు వివరించారు. కార్యక్రమంలో గ్లోబల్ ట్రీ సీఈవో శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.