All party meet : పహల్గాం ఉగ్రదాడిపై దేశ రాజధాని ఢిల్లీలో మరికాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఉగ్రదాడిపై అనుసరించాల్సిన విధానంపై చర్చించనున్నారు. అయితే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఈ సమావేశానికి ఆహ్వానం అందలేదు. ఇదే విషయమై ఒవైసీ గత రాత్రి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజుకు ఫోన్ చేసి ప్రశ్నించారు.
అందుకు కిరణ్ రిజుజు బదులిస్తూ.. పార్లమెంట్లో కనీసం ఐదుగురు ఎంపీలు ఉన్న పార్టీలను మాత్రమే అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించామని చెప్పారు. చిన్న పార్టీలను ఎందుకు ఆహ్వానించలేదని అసద్ ప్రశ్నించగా.. కీలక సమావేశం అధిక సమయం తీసుకుంటుందనే పిలువలేదని చెప్పారు. మరి మా చిన్న పార్టీల సంగతేంటని అసద్ మళ్లీ అడుగగా.. మీ గొంతు చాలా గట్టిగా వినిపిస్తుందని రిజుజు జోక్ చేశాడు.
ఈ విషయాన్ని అసదుద్దీన్ ఒవైసీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. అఖిలపక్ష సమావేశంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుపట్టారు. ఉగ్రవాదంపై తీసుకోబోయే నిర్ణయం దేశ ప్రజలందరికీ సంబంధించినదని, అలాంటి సమావేశానికి కొన్ని పార్టీలను మాత్రమే ఆహ్వానించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. చిన్న పార్టీలను ఆహ్వానించకపోవడానికి ఇదేమైనా బీజేపీ అంతర్గత సమావేశమా..? అని అసద్ ప్రశ్నించారు.