Nizampet | దుండిగల్, మే 2: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు నామమాత్రంగా చేపట్టడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఉన్నతాధికారులకు నివేదిక అందజేయాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కూల్చివేయాల్సి వస్తుందన్నట్టుగా తూతూ మంత్రంగా పనులు చేపట్టి వదిలేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్లో అనుమతులు లేకుండా, అనుమతులకు మించి అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులకు ఫిర్యాదులు వెలువేత్తాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నిజాంపేటలోని సైదప్ప కాలనీ సమీపంలో ఉన్న రెండు నిర్మాణాలను కూల్చివేసే పనులను కిందిస్థాయి సిబ్బందికి అధికారులు అప్పగించారు. అయితే సిబ్బంది మాత్రం మేము గిచ్చినట్టు చేస్తాము… మీరు ఏడ్చినట్టు చేయండి అన్న రీతిలో కూల్చివేతలు చేపట్టి చేతులు దులుపుకున్నట్టు స్థానికులు విమర్శిస్తున్నారు. అక్రమార్కుల పట్ల అధికారులకు, సిబ్బందికి అంత ప్రేమ ఎందుకో…? తెలియడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పేదవాడు అనుమతి లేకుండా చిన్న రేకుల గది ఏర్పాటు చేసుకుంటే నానా హంగామా చేసే సిబ్బంది బిల్డర్ల పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించలేదనేది బహిరంగ రహస్యమేనని పలువురు పేర్కొంటున్నారు. ఇది విషయమై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సాబేర్ అలీని వివరణ కోరగా తన దృష్టికి ఈ విషయం రాలేదని , పరిశీలిస్తానని పేర్కొనడం గమనార్హం.