దుండిగల్,జూన్ 25: నిజాంపేట్ చెత్త డంపింగ్ యార్డు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రిక్షా కార్మికులు, స్వచ్ఛ ఆటోవాలాలు తాము ఇండ్లల్లో నుంచి సేకరించిన వ్యర్థాలను చెత్త డంపింగ్ స్థలంలో వేయకుండా ముందున్న రోడ్డుపైన్నే వేస్తున్నారు. మున్సిపల్ బాధ్యులెవరు లేకపోవడంతో పరిస్థితి రోజురోజుకు ఇబ్బందికరంగా మారింది. రోడ్డంతా చెత్తకుప్పలతో దర్శనమిస్తూ ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంది. డంపింగ్ యార్డు నుంచి వెలువడే దుర్వాసన, మరోవైపు ట్రాఫిక్ జాం కావడం వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
నిజాంపేట్ సర్కిల్ శానిటేషన్ విభాగం అధికారుల నిర్లక్ష్యం, చెత్త కార్మికుల అలసత్వం కారణంగానే చెత్తకుప్పలు రోడ్డుమీదకి వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. డంపింగ్ యార్డును ఆనుకునే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న గిరిజన బాలికలు, మహిళల రెసిడెన్షియల్ పాఠశాల,కళాశాల, ఆ పక్కనే డబుల్ బెడ్రూం గృహ సముదాయాలు ఉన్నప్పటికీ సర్కిల్ అధికారులు చెత్త డంపింగ్ యార్డు సమస్యను నిర్లక్ష్యం చేయడంపై మండిపడుతున్నారు. నిజాంపేట్ సర్కిల్, బాచుపల్లిలోని సర్వేనంబర్ 186లోని చెత్త డంపింగ్ కేంద్రంతో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 9వ
తేదీన రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెత్త డంపింగ్ కేంద్రాన్ని సందర్శించారు. పరిసర ప్రాంత ప్రజలు, స్థానికుల గోడును విన్న మంత్రి వెంటనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనకు ఫోన్ చేసి పక్షం రోజుల్లో డంపింగ్ కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. దీంతో ఆమె ఒక నెల రోజుల సమయం కావాలని మంత్రిని కోరారు. కాగా మంత్రి ఆదేశాలు జారీ చేసి పక్షం రోజులు గడుస్తున్నా ఎటువంటి పనులు జరగక పోగ, చెత్త సేకరించే కార్మికులు ఏకంగా రోడ్డుపైనే వేస్తుండటం పై స్థానికులు మండిపడుతున్నారు.