సుల్తాన్‌బజార్, ఆగస్టు 5: నిజాం కళాశాలలోని గర్ల్స్ హాస్టల్‌ను వంద శాతం యూజీ విద్యార్థినులకే కేటాయించాలంటూ.. సోమవారం సైతం విద్యార్థులు ఆందోళన చేశారు. తొలుత చింతచెట్టు వద్ద నిరసన తెలిపిన విద్యార్థులు.. తమకు న్యాయం చేయాలంటూ.. రోడ్డెక్కారు. బషీర్‌బాగ్ చౌరస్తాలో బైఠాయించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో అబిడ్స్ పోలీసులు విద్యార్థులను శాంతింపజేసేందుకు యత్నించారు.
వారు వినకపోవడంతో అరెస్టు చేసి.. షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, ఈ ఏడాది యూజీ విద్యార్థినుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇందుకు అణుగుణంగా హాస్టల్లో వంద శాతం యూజీలకే వసతి కల్పించాలని 5,6 రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేపట్టామని, తమకు న్యాయం చేయాలనే రోడ్డెక్కినట్లు విద్యార్థులు చెప్పారు. నిజాం కళాశాలలో గర్ల్స్ హాస్టల్ నిర్మాణం పూర్తయిన అనంతరం యూజీ, పీజీలకు హాస్టల్ వసతి కేటాయించినట్లు ప్రిన్సిపాల్ భీమా తెలిపారు. హాస్టల్ సామర్థ్యం 300 మాత్రమే అయినా.. విద్యార్థినుల ఇబ్బందులు చూడలేక 450 మందికి వసతి కల్పించినట్లు చెప్పారు.