సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): సాధారణంగా నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ఏదైన పెద్ద దవాఖానకు వెళ్లినప్పుడు అక్కడ ఏ విభాగం ఎక్కడ ఉందో చాలా మందికి తెలియదు. అక్కడ ఉన్న సిబ్బంది సైతం కొన్ని సార్లు సమాచారం ఇవ్వడంలో కొంత చిరాకు పడుతుండడం, తమకు తెలియదని దాటవేయడం, లేదా అటు వెళ్లమని మొక్కుబడిగా చెప్పడం వంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. దీంతో చాలా మంది రోగులు, వారి సహాయకులు దవాఖానలో గంటల తరబడి అటూ ఇటూ చెప్పులరిగేలా తిరుగుతుంటారు. దీనివల్ల చాలా సమయం వృథా కావడమే కాకుండా సరైన సమాచారం అందక చాలా ఇబ్బందులకు గురవుతుంటారు.
ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టి, రోగులకు సరైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో నిమ్స్ అధికారులు ఒక విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే ఏఐ రిసెప్షన్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్న నిమ్స్ అధికారులు వైద్య సేవల్లోనే కాకుండా పరిపాలనా విభాగంలో సైతం కృత్రిమ మేధ(ఏఐ)ని వినియోగానికి పెద్దపీఠ వేస్తున్నారు. ఇందులో భాగంగా నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో మూడు రోజుల కిందట ఏఐ రిసెప్షన్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ప్రస్తుతం స్పెషాలిటీ బ్లాక్‌లో ఏఐ రిసెప్షన్ ట్రయల్ రన్‌ను ప్రారంభించాం. ఇది విజయవంతమైతే అన్ని బ్లాక్‌లలో ఏర్పాటు చేస్తాం. దీని వల్ల రోగులకు సరైన సమాచారం అందించడంతో పాటు అటూ, ఇటూ తిరగాల్సిన పని ఉండదు. ముఖ్యంగా నిరక్ష్యరాస్యులు ఎవరిని అడగకుండా తమకు కావల్సిన సమాచారాన్ని రోబో ముందు నిల్చుని అడిగితే చాలా రోబో చెప్పేస్తుంది. త్వరలోనే ఓపీ, వైద్య పరీక్షలు వంటి వాటికి సంబంధించిన పేమెంట్స్‌ను కూడా క్యూర్ కోడ్ల ద్వారా కియోస్క్, రోబో యంత్రాల వద్దనే ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్బిఐ అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. మెడికల్ రిపోర్ట్స్ కూడా ఈ యంత్రాల ద్వారానే తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయనున్నాం.

ఇప్పటికే నిమ్స్ యాప్‌ను, క్యూర్ కోడ్, ఆన్లైన్ అపాయింట్మెంట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఏఐ రిసెప్షన్, ఏఐ చెల్లింపులు, రిపోర్ట్స్ కలెక్షన్ సేవలు కూడా అందుబాటులోకి వస్తే రోగులకు క్యూలైన్లలో నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల సమయం కూడా వృథా కాదు. అలాగే వైద్య పరీక్షల్లో జాప్యాన్ని తొలగించేందుకు అటోమేటిక్ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఉదయం 10 గంటలకు శాంపిల్స్ ఇస్తే మధ్యాహ్నం 2 వరకు దాదాపు అన్ని రకాల నివేదికలు వచ్చేస్తాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే ఒకే సారి 5వేల మెడికల్ రిపోర్ట్స్‌ను ఇవ్వగలుగుతున్నాం. బయోకెమిస్ట్రీ, పాథలాజి, మైక్రోబయాలజి విభాగాలకు సంబంధించిన అన్ని రకాల రక్త పరీక్షలను ఈ ఆటోమేటిక్ ల్యాబ్‌లలో నిర్వహిస్తుండడం వల్ల నివేదికలు వెంట వెంటనే ఇవ్వగలుగుతున్నాం.
– డాక్టర్ బీరప్ప, నిమ్స్ డైరెక్టర్
రోగులకు నిరీక్షణ నుంచి ఉపశమనం
నిమ్స్ దవాఖానలో ప్రతి రోజు సుమారు 3500 నుంచి 4200 మంది ఓపీ సేవలు పొందుతుంటారు. చాలా మందికి ఏ విభాగం ఎక్కడ ఉందో తెలియదు. సరైన సమాచారం లేక రోగులు అటూ ఇటూ తిరిగి సమయాన్ని వృథా చేసుకుంటారు. అంతే కాకుండా సరైన అవగాహన లేక సంబంధం లేని విభాగంలో ఓపీ రిజిస్ట్రేషన్ కోసం క్యూలో నిరీక్షించి, తీరా సమస్య చెప్పగానే అక్కడి సిబ్బంది ‘ఈ సమస్యకు ఓపీ ఇక్కడ కాదు ఆ పక్క బ్లాక్‌కు వెళ్లండి’ అని చెప్పడంతో రోగులు మళ్లీ పక్క బ్లాక్‌కు పరుగు తీస్తుంటారు. ఈ క్రమంలో రోగులు ఎక్కవ సమయం క్యూలైన్లలో నిరీక్షించకుండా ఉండేందుకే ఏఐ రిసెప్షన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్పా తెలిపారు.
సమగ్ర సమాచారం ఇస్తుంది..
ఏఐ రిసెప్షన్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న రోబో ముందు నిల్చుని ‘నాకు కడుపు నొప్పి సమస్య ఉంది ఏ డాక్టర్ని కలవాలి?’ అని అడిగితే చాలు. గ్యాస్ట్రో విభాగం వైద్యుడిని కలవండి అని సూచిస్తుంది. అంతే కాదు అక్కడ వైద్యులు ఏయే వైద్యులు అందుబాటులో ఉన్నారో కూడా సమాచారం ఇస్తుంది. రక్త పరీక్షలు ఎక్కడ చేస్తారు, మెడికల్ రిపోర్ట్స్ ఎక్కడ ఇస్తారు తదితర అన్ని రకాల సమాచారాన్ని ఈ ఏఐ రోబో అందిస్తుంది.