NIMS | ఖైరతాబాద్, మార్చి 8 : గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ యువకుడికి నిమ్స్ వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలను రక్షించారు. హైదరాబాద్ నగరానికి చెందిన పూజారి అనిల్ కుమార్ (19) కొంత కాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. నిమ్స్ దవాఖానలో చేరగా, పరీక్షించిన వైద్యులు గుండె మార్పిడి మాత్రమే పరిష్కారమని చెప్పారు. దీంతో గుండె మార్పిడికోసం జీవన్‌దాన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు.
కాగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన 24 ఏండ్ల యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడి బ్లడ్ గ్రూప్ అనిల్ కుమార్ బ్లడ్ గ్రూపుతో మ్యాచ్ అయ్యింది. దీంతో గ్రీన్ చానెల్ ద్వారా గుండెను నిమ్స్ దవాఖానకు వైద్యులు తరలించారు.
కార్డియో థొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అరమరేష్ బాబు నేతృత్వంలో వైద్యుల బృందం శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా గుండెమార్పిడి చేశారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఆనిల్ కుమార్‌కు పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించామని, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. గతేడాది 62 మందికి మూత్రపిండాలు, నలుగురికి కాలేయం, ఇద్దరికి గుండె, ఒకరికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించామని, ఈ ఏడాది 16 మందికి మూత్రపిండాలు, ఒకరికి కాలేయం, ఒకరికి గుండె మార్పిడులు చేశామన్నారు. గత సంవత్సరం ఒక వ్యక్తి గుండె, ఊపిరితిత్తులు ఒకే సారి ట్రాన్స్ ప్లాంట్ చేశామని, దేశంలోని ప్రభుత్వ దవాఖానాల్లో ఒక్క నిమ్స్ లో మాత్రమే ఈ ఘనత సాధించామన్నారు.