సిటీబ్యూరో, ఆగస్ట్ 13(నమస్తే తెలంగాణ) : రోబోటిక్ సర్జరీలో నిమ్స్ దూసుకుపోతున్నది. ప్రభుత్వ హాస్పిటళ్లలో అత్యంత వేగవంతంగా ఈ మైలురాయిని చేరుకోగా, ఏడాది కాలంలోనే 300 రోబోటిక్ సర్జరీలను నిమ్స్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. రోబోటిక్ అసిస్టెంట్ సర్జరీ పేరిట ఈ సేవలను వినియోగంలోకి తీసుకురాగా అనతి కాలంలోనే చేరుకున్నది.
యూరాలజీ, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జరీ, సర్జికల్ అంకాలజీ విభాగాల ద్వారా అనేక క్లిష్టమైన శస్త్ర చికిత్సలను కూడా సునాయాసంగా అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ బీరప్ప నగరి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్ సర్జరీ వైద్య రంగంలోనే సంచలనాత్మకంగా మారిందన్నారు.
ఈ క్రమంలో అధునాతన సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ వైద్య సేవలు అందించడం తాము సాధించిన విజయమేనన్నారు. ఇందుకు సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రోబోటిక్ సర్జరీ కో ఆర్డినేటర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ సర్జరీల్లో టెక్నాలజీ వినియోగానికి ప్రభుత్వ సహకారం విప్లవాత్మక వైద్య సేవలకు కారణమైందన్నారు. రోబోటిక్ అసిస్టెంట్ సర్జరీ టెక్నాలజీ తయారీ సంస్థ ఏపీఏసీ ఆఫ్ ఇంటూటివ్ వీపీ డార్ల హట్టన్ మాట్లాడుతూ సర్జికల్ సిస్టమ్‌ను ఏకీకృతం చేయడంతో వైద్య రంగంలో ముఖ్యమైన దశను చేరుకున్నామన్నారు.