సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ):పాతబస్తీలోని ఒక ప్రాంతంలో పూర్తిగా పేదరికంలో ఉన్న ఓ కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతోంది. ఈ గొడవలకు కారణం ఆర్థిక సమస్యలు. వీటికి చెక్ పెట్టాలంటే డబ్బులు కావాలి. ఇదే సమయంలో ఒక దళారీ రంగప్రవేశం చేసి ఆ ఇంట్లో ఉన్న యువతికి కాంట్రాక్ట్ పెళ్లి చేస్తే భారీగా డబ్బులు ముట్ట చెప్తామని ఆశపెట్టాడు. ఈ కాంట్రాక్ట్‌కు ఒప్పుకున్న యువతి.. ఒక నైజీరియన్‌ను ఆరునెలల కాంట్రాక్ట్‌తో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతను ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఈ సమయంలోనే ఆమెను ఇబ్బందిపెట్టడంతో కోర్టులో కేసు పెట్టింది. ప్రస్తుతం ఆ కాంట్రాక్ట్ పెళ్లి కాస్తా కోర్టులో కేసు వరకు వెళ్లడంతో యువతికి ఇబ్బందులు, నైజీరియన్‌కు తన దందాలు కొనసాగించేందుకు అవకాశం వచ్చింది.
చార్మినార్ ఏరియాలోని ఒక ఇంట్లో దంపతులు ఎప్పుడూ గొడవ పడుతున్నారు. వారికి పేదరికం, అధికసంతానం, బిడ్డల పోషణ భారంగా మారడంతో గొడవలు జరుగుతున్నాయి. ఇదే అదనుగా ఓ దళారీ రంగప్రవేశం చేశాడు. ఆ ఇంటి పెద్దకు డబ్బు ఆశచూపాడు. కుటుంబంలోని యువతికి నైజీరియన్తో వివాహం జరిపించాడు. ఆరునెలలు కాగానే అతడు రాజస్థాన్ వెళ్లిపోయి అడపాదడపా వచ్చిపోతున్నాడు. ఇప్పుడా ఆ యువతి పరిస్థితి దయనీయంగా మారింది. అతను ఇచ్చిన ఐడెంటిటీ వివరాలేవీ సక్రమంగా లేకపోవడంతో ఆ యువతి ప్రస్తుతం పోలీసులకు చెప్పుకోలేక నానాయాతన అనుభవిస్తోంది.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీతోపాటు పలుచోట్ల పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి దందాలతో నైజీరియన్లు , దళారీలు మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా విదేశాలకు చెందినవారు యువతులను కాంట్రాక్ట్ పెళ్లిళ్ల పేరుతో చేస్తున్న మోసాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయని చెప్పారు..
కాంట్రాక్ట్ పెళ్లి పేరుతో నయాదందా..!
గతంలో గల్ఫ్ షేకులు కొందరు పాతబస్తీ శివారు ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాల్లోని యువతులు, బాలికలను పెళ్లి చేసుకుని మోసగించిన ఘటనలు చాలా ఉన్నాయి. పోలీసులు, స్వచ్ఛంద సంస్థల చొరవతో వాటికి అడ్డుకట్ట వేశారు. తాజాగా కొందరు విదేశీయులు తాత్కాలికంగా నగరంలో నివాసం ఉంటూ పేద కుటుంబాల్లోని బాలికలను పెళ్లి పేరిట మోసగిస్తున్నారని పోలీసులు తెలిపారు. నైజీరియన్లు కాంట్రాక్ట్ పెళ్లిళ్లు చేసుకుంటున్నట్లుగా నయాదందా వెలుగులోకి వచ్చిందని వారు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ పెళ్లి పేరిట నయవంచన మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
చీకటి కార్యకలాపాలతో వచ్చిన సొమ్ముతో స్థానిక యువతులను మోసగించి వివా హం చేసుకుంటున్నారు. వీరి మాయమాటలు నమ్మి డబ్బుకు ఆశపడిన కొందరు యువతులు కాంట్రాక్ట్ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వీరిని పెళ్లి చేసుకున్న తర్వాత రాజస్థాన్‌లో ఉంటూ ఇక్కడికి రాకపోకలు కొనసాగిస్తున్నారు. నైజీరియన్లు ఇక్కడే ఉండడానికి కావాలనే కేసులు పెట్టించుకుంటున్నారు. డిపొటేషన్నుంచి తప్పించుకోవడం కోసం తమకు తాముగా పోలీసులకు చిక్కుతున్నారు. పేద యువతులను పెళ్లిచేసుకుని వారితో కలిసి ఉంటూ ఆ తర్వాత రాజస్థాన్‌కు వెళ్లి వచ్చిపోతుండడంతో ఏం చేయా లో పాలుపోని పరిస్థితుల్లో యువతులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
గడువు ముగిసినా ఇక్కడే..!
సైబర్‌నేరాలు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌లో ఆరితేరిన నైజీరియన్లు విద్య, వ్యాపారం, టూరిజం వీసాలతో భారత్‌లో మకాం వేస్తున్నారు. గోవా, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె, తదితర ప్రధాన నగరాలను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండేందుకు తెలివిగా వ్యవహరిస్తున్నారు. స్థానికులతో గొడవ పడడం, డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉద్దేశపూర్వకంగా పట్టుబడడంతో పోలీసులు వారిపై కేసులు పెట్టేలా చేసుకుంటున్నారు.
సహజంగా కేసులంటేనే భయం ఉండే క్రమంలో కావాలని కేసులు పెట్టించుకుని.. ఇక్కడే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. స్థానిక యువతులను వివాహమాడి, వారిని ఇబ్బందుల్లో పెట్టి కేసులు పెట్టించుకోవడం, కేసు కోసం ఇక్కడే ఉండి డ్రగ్స్ పెడ్లింగ్ చేయడం వంటివి చేస్తున్నారని పోలీసులు చెప్పారు. నైజీరియన్లు, సూడాన్, టాంజేనియా దేశాలకు చెందిన పలువురు వ్యక్తులు ఈ రకమైన దందాను కొనసాగిస్తున్నారని, డబ్బుల కోసం ఆశపడి మహిళలు తమ జీవితాలను ఆగం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.