NGRI | ఉప్పల్, మే 30: హైదరాబాద్లోని సీఎస్ఐఆర్-జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థలో పనిచేస్తున్న చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎం.రామ్మోహన్ ప్రతిష్టాత్మకమైన నేషనల్ జియో సైన్స్ అవార్డు 2024కు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎన్జీఆర్ఐ ఒక ప్రకటన విడుదల చేశారు.
భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ అందించే ఈ అవార్డు, భూ రసాయన శాస్త్ర రంగానికి రామ్మోహన్ చేసిన అసాధారణ కృషిని గుర్తిస్తూ ప్రదానం చేస్తారని ఎన్జీఆర్ఐ ప్రకటనలో తెలిపింది. డాక్టర్ మోహన్ ముఖ్యంగా ఆర్కియన్ క్రస్టల్ పెరుగుదల ప్రక్రియలు, బంగారు లోహ శాస్త్రం, ఇండియన్ షీల్డ్ పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవడంలో పరిశోధన చేశారు. భూ రసాయన శాస్త్రం, భూ కాలానుక్రమ శాస్త్రం , ఐసోటోప్ భూరసాయన శాస్త్రంలో ప్రత్యేకత కలిగిన ఆయన విస్తృత పరిశోధన ఆర్కియన్ ధార్వార్, బస్తర్, సింగ్భూమ్, బుందేల్ఖండ్ క్రేటాన్లు, దక్షిణ గ్రాన్యులైట్ ప్రాంతాల వరకు విస్తరించింది. డాక్టర్ మోహన్ తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఫెలో, ఐజీయూ కృష్ణన్ గోల్డ్ మెడల్, డి య్ టి (భారత ప్రభుత్వం) బాయ్స్ స్కాస్ట్ ఫెలోషిప్, సీఎస్ఐఆర్-రామన్ రీసెర్చ్ ఫెలోషిప్లతో సత్కరించబడ్డారు. నేషనల్ జియోసైన్స్ అవార్డు – 2024కి ఆయన ఎంపిక భారతదేశంలో భూ విజ్ఞాన పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర ఉంటుందని తెలిపారు.