Love Marriage | శంషాబాద్ రూరల్, జూన్ 4 : ఆ ఇద్దరు మనసారా ప్రేమించుకున్నారు.. మనువాడారు.. కానీ ప్రేమ పెళ్లి చేసుకున్న పది రోజులకే పెళ్లాం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన శంషాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముచ్చింతల్ గ్రామ పరిధిలోని వినోద్ గార్డెన్లో నివాసముంటున్న ఇస్తారి.. మౌనిక(22) అనే యువతిని గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. ఇరువురి మనసులు కలియడంతో.. గత నెల 20వ తేదీన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ నెల 1వ తేదీన స్నేహితుడి దగ్గరికి వెళ్లేందుకు ఇస్తారి రెడీ అయ్యాడు. అక్కడికి వెళ్లొద్దని మౌనిక వారించడంతో.. నూతన దంపతుల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు ఇంట్లోనే ఉండిపోయారు.
ఈ నెల 3 తేదీన భర్త ఇస్తారి డ్యూటీ నిమిత్తం ఉదయం 9.40 నిమిషాలకు తుక్కుగూడకు వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత తన భార్యకు మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. తన సోదరుడికి ఫోన్ చేసి ఆరా తీయగా.. మౌనిక ఇంట్లో లేదని చెప్పాడు. అప్రమత్తమైన ఇస్తారి.. మౌనిక ఆచూకీ కోసం వెతికాడు. బంధువుల వద్ద కూడా లభించకపోవడంతో.. బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.