సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేడుకలను మద్యం ప్రియులు ఫుల్ జోష్‌తో జరుపుకొన్నారు. పాత సంవత్సరం జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. 2025కు వీడ్కోలు పలికి, 2026కు ఫుల్ జోష్‌తో స్వాగతం పలికారు నగరవాసులు. ఈ సందర్భంగా గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో డిసెంబర్ 31న బుధవారం ఒక్కరోజే రూ.160 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో నమోదైన సేల్ వ్యాల్యూస్ ద్వారా తెలుస్తున్నది.
గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం విక్రయాలు ఏమత్రం తగ్గలేదు. 2024 డిసెంబర్ 31న కూడా గ్రేటర్లో రూ.150 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయి. గ్రేటర్‌వ్యాప్తంగా మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, క్లబ్బులు, పబ్బులే కాకుండా నూతన సంవత్సర వేడుకలకు ఫామ్ హౌస్‌లు, రిసార్ట్స్ తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈవెంట్ ఆర్గనైజేషన్లు మద్యం విక్రయాలకు అదనంగా అనుమతులు పొందాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏటా న్యూ ఇయర్ ఈ వెంట్ల సంఖ్య తగ్గినప్పటికీ మ ద్యం విక్రయాలు మాత్రం తగ్గకపోవడం విశేషం.
సాధారణంగా యువత బీరునే ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఈ సారి చలి తీవ్రత కారణంగా వారు బీరుకు కొంత దూరంగా ఉండి లిక్కర్‌పై మోజు చూపినట్లు తెలుస్తున్నది. 2024 డిసెంబర్ 31న 10 లక్షల కేసుల బీర్లు అమ్ముడైతే ఈ సంవత్సరం 6 లక్షల కేసుల బీరు విక్రయాలు జరినట్లు తెలిసింది. గతంతో పోల్చితే ఈ సారి బీరు విక్రయాలు 4 లక్షల కేసులకు పడిపోయాయి. అదే సమయంలో ఐఎంఎల్ విక్రయాలు పెరిగాయి. అలాగే ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది విదేశీ మద్యం విక్రయాలు జరిగాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్‌సిటీ, శంషాబాద్, బేగంపేట వంటి పాష్ ఏరియాల్లోని మద్యం దుకాణాలతో పాటు పలు స్టార్ హోటళ్లు, పబ్‌లు, క్లబ్బులు, పార్టీల్లో జోరుగా విదేశీ మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం. సుమారు రూ.10.56కోట్ల వరకు వీటి అమ్మకాలు సాగినట్లు అంచనా.
చలి ప్రభావంతో హార్డ్(ఐఎంఎల్) విక్రయాలు ఊపందుకున్నాయి. గత సంవత్సరం గ్రేటర్ పరిధిలో 7లక్షల 50వేల కేసుల ఐఎంఎల్ విక్రయాలు జరిగితే ఈ సంవత్సరం 9 లక్షల కేసుల ఐఎంఎల్ అమ్ముడయ్యాయి. ఒక కేసులో 12 మద్యం బాటిళ్లు ఉంటాయి. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం లక్షా 50వేల ఐఎంఎల్ కేసుల విక్రయాలు పెరిగాయి.