సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): పండుగలు వస్తే చాలు.. కొందరు బల్దియా ఇంజినీర్లు అందినంత దండుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అత్యవసర పనుల పేరిట టెండర్లను అస్మదీయులకు కట్టబెట్టి.. జేబులు నింపుకుంటున్నారు. ఏండ్ల తరబడి చిన్నా చితక కాంట్రాక్టర్ వృత్తినే నమ్ముకొని ఉపాధి పొందుతున్న వారి పొట్టకొడుతూ .. అడ్డదారిలో వచ్చిన వారికే లక్షలాది రూపాయల టెండర్లను అప్పగిస్తున్నారు. తాజాగా దుర్గామాత విగ్రహాల నిమజ్జన టెండర్ ప్రక్రియలో అక్రమాలకు తెరలేపారు. క్రేన్లు సొంతంగా ఉన్న వారికే పనులంటూ..కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
వినాయక నిమజ్జన టెండర్ నిబంధనల ప్రకారమే దుర్గామాత విగ్రహాలను తొలగింపు బాధ్యతలు అప్పగించడంలో కాంట్రాక్టర్లందరికీ అవకాశం కల్పించాలి. కానీ కాసులకు కక్కుర్తి పడిన ఖైరతాబాద్ జోన్ సర్కిల్-17లో టెండర్ల నిబంధనలను మార్చారు. చిన్న కాంట్రాక్టర్ల పొట్ట కొట్టే చర్యలకు పాల్పడి పెద్దలు మాత్రమే పనులు దక్కించుకునే కొత్త నిబంధనలు చేర్చారు. తొలుత విగ్రహాల తొలగింపు ప్రక్రియ ఎవరైనా టెండర్లో పాల్గొనవచ్చని పేర్కొన్న అధికారులు ..ఒక్కసారిగా క్రేన్లు సొంతంగా ఉన్న కాంట్రాక్టరే టెండర్ ప్రక్రియలో పాల్గొనేలా టెండర్‌ను పిలిచారు. క్రేన్లు ఉన్న వారికే అవకాశం కల్పించిన తీరు కాంట్రాక్టర్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత వాటిని తొలగింపునకు సంబంధించి వినాయక చవితి సందర్భంగా పిలిచిన టెండర్ నిబంధనల ప్రకారమే అందరికీ అవకాశం కల్పిస్తూ ఎల్బీనగర్ జోనల్ ఇంజినీర్లు టెండర్లు పిలిచారు. అయితే ఖైరతాబాద్ సర్కిల్-17లో నెక్లెస్‌రోడ్, పీఫుల్ప్లాజాలో బేబీ పాండ్స్ వద్ద స్టాటిక్ క్రేన్ల వినియోగం, కార్మికులతో విగ్రహాల తొలగించేందుకు రూ.40 లక్షలతో ఈ నెల 23న టెండర్ పిలిచారు. కేవలం మూడు రోజుల షార్ట్ టెండర్ పిలిచారు. సొంతంగా క్రేన్లు ఉండాలంటూ రూల్స్ మార్చారు. పెద్ద కాంట్రాక్టర్‌కే ఈ పనులు అప్పగించేందుకు రంగం సిద్ధం చేయడం గమనార్హం. ఎల్బీనగర్ టెండర్‌ను రూ.10లక్షలు ఖరారు చేయగా..ఖైరతాబాద్ టెండర్ మాత్రం రూ.40 లక్షలకు పెంచడంలో మతలబు ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఇంజినీర్ల అవినీతి తారాస్థాయికి చేరిందని, ఇష్టారీతిలో టెండర్ నిబంధనలను మారుస్తూ.. పెద్దోళ్లకు కొమ్ముకాస్తున్నారు. అధికారులు టెండర్ అనుకూల వ్యక్తులకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జన క్రేన్లు ఏర్పాటు చేయాలంటే గతంలో క్రేన్లు ఉన్న వారి దగ్గర నుంచి నెల, రెండు నెలలకు లీజుకు తీసుకొని టెండర్లలో పాల్గొనే అవకాశం ఉండేదని చెప్పారు.
కానీ ఇష్టానుసారంగా టెండర్ల కండిషన్ ఒకరిద్దరికే అనుకూలంగా ఉండేలా మార్చడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొత్త విధానాలతో కాంట్రాక్టర్ల ఉపాధిని దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు నెలల నుంచి పెండింగ్ బిల్లులు రాక చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా వచ్చే చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా రాకుండా చేస్తూ కాంట్రాక్టర్లను వేధిస్తున్నారని మండిపడుతున్నారు. రెండు రకాలుగా ఉపాధి కోల్పోతున్నామని, కనీసం సంపాదన లేకపోవడంలో ఆర్థిక భారం వేధిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.