మేడ్చల్, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ): నూతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మంజూరీకే పరిమితమయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కొత్తగా 24 ప్రాథమిక పాఠశాలలు మంజూరు అయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలోనే (జూలై 31 వరకు) ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశింంచింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించిన విద్యాశాఖ అధికారులు.. ఆయా భవనాల్లో మౌలిక సదుపాయలు లేని విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ క్రమంలో జిల్లాలోని ఉన్నతాధికారులు విద్యాశాఖ గుర్తించిన ప్రభుత్వ భవనాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అయితే ఆయా భవనాల్లో మౌలిక సదుపాయలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలున్నాయి. దీంతో కొత్త పాఠశాలలు ప్రారంభానికి నోచుకోవడం లేదు.
వాస్తవానికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో కొత్తగా 24 ప్రాథమిక పాఠశాలలు ఈ ఏడాది జూలై 31 వరకు ప్రారంభించాల్సి ఉండగా అందులో రెండు మాత్రమే ప్రారంభం అయ్యాయి. మిగతా 22 పాఠశాలలు ఈ విద్యాసంవత్సరంలో ప్రారంభించేది అనుమానంగా కనపడుతుంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు దాటిన విషయం తెలిసిందే.
నిధుల లేమే కారణమా..?
ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు విద్యాశాఖ అధికారులు.. ప్రభుత్వ భవనాలతో పాటు కమ్యూనిటీహాళ్లు, కాలనీలలోని సంక్షేమ సంఘాలలో భవనాలను గుర్తించారు. అయితే జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖల వద్ద నిధుల లేమి వలనే ఆయా భవనాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారా అన్న అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.
గుర్తించిన భవనాలలో బాత్రూమ్లు, మంచినీరు, విద్యుత్ సౌకర్యాలతో పాటు మరమ్మతులు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చిన ఎలాంటి ఫలితం లేకుండా పోవడంతో గడువు ముగిసిన పాఠశాలలు ప్రారంభం కాలేదు. అద్దె భవనాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదూశాలే రాని క్రమంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలే పాఠశాలల ఏర్పాటుకు దిక్కయ్యాయి.శాఖల మధ్య సమన్వయం కూడాకరువైందని విమర్శలున్నాయి.
పాఠశాలల ఏర్పాటు పూర్తైతేనే..
ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు పూర్తయితేనే ఉపాధ్యాయుల కేటాయింపును విద్యాశాఖ పూర్తిచేసే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయులు ప్రమెషన్లపై విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కొత్త పాఠశాలల ఏర్పాటుకు మరింత అలస్యం జరగనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దిన క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 504 ప్రభుత్వ పాఠశాలలో 98వేల మంది విద్యార్థులు చదువుకునే పరిస్థితి వచ్చిందటే అది మాజీ సీఎం కేసీఆర్ కార్యదీక్షతే అంటూ విద్యార్థులు తల్లిదండ్రులు గుర్తు చేస్తున్నారు.