చార్మినార్, జనవరి 2: నిరుద్యోగ యువతీ యువకులకు మరింత మెరుగైన శిక్షణ అందించడానికి సెట్విన్ కొత్త కోర్సులను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నదని సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాల్‌రావు తెలిపారు. గురువారం ఆయన సెట్విన్ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఈవీ మోటారు వాహనాలు విస్తృతంగా వినియోగంలోకి రానున్నాయని, ఈ నేపథ్యంలో ఆ రంగంలో యువత మరింతగా రాణించడానికి అనుగుణంగా ఈవీ కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఈ కోర్సును నల్గొండలో అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఈవీ కోర్సును త్వరలో పాతనగరంలోని మిరాలం ట్యాంక్‌లోని సెట్విన్ శిక్షణ కేంద్రంలోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కొత్త కోర్సులను సెట్విన్‌లో అందుబాటులోకి తీసుకువస్తూ మరిన్ని కేంద్రాలను సైతం గ్రామీణ యువతకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. జహీరాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జడ్చర్ల ప్రాంతాల్లోనూ సెట్విన్ శిక్షణ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
ప్రస్తుతం సెట్విన్ ఆధ్వర్యంలో ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ 30 కోర్సులు అందుబాటులో ఉన్నాయని, మరిన్ని కోర్సులను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సెట్విన్ ఆధ్వర్యంలో మెరుగైన శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డిప్లొమా ఫ్యాషన్ టెక్నాలజీతోపాటు ఫైతాన్, టూరిజం మేనేజ్మెంట్ లాంటి కోర్సులతోపాటు యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే కోర్సులను సెట్విన్‌లో అందిస్తున్నామని వేణుగోపాల్‌రావు తెలిపారు.