సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): మూడున్నరగంటల్లో 10 కి.మీ అంటే సగటున గంటకు 2.86 కి.మీ.. హైదరాబాద్ కొత్త బెంచ్‌మార్క్ ఇది. ఫార్ములా వన్ని మర్చిపో.. హైదరాబాద్ ట్రాఫిక్ లీగ్ 2025కి స్వాగతం పలుకుతూ.. ఇది అక్షర దోషం కాదని, నడకపోటీ అంతకంటే కాదని, ఇది పూర్తిగా దేశంలోని సాంకేతిక రాజధానుల్లో సగటు ట్రాఫిక్ వాస్తవ వేగమంటూ సుధాకర్‌రెడ్డి అనే నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి నగరమంతా అతలాకుతలమైంది.
ఒక్కొక్కరూ కిలోమీటర్ ప్రయాణం చేయాలంటే గంటలకొద్దీ సమయం పట్టిన దారుణమైన పరిస్థితులను అనుభవించారు. తమ అనుభవాలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ హైదరాబాద్‌ను వ్యంగ్యంగా అభివర్ణించారు. సుధాకర్‌రెడ్డి తన ట్వీట్లో తాను సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు కూకట్పల్లి ఐడీఎల్ నుంచి బయలుదేరి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బంజారాహిల్స్ తన కార్యాలయానికి రావడానికి కేవలం ఇరవై నిముషాలు పడుతుందని, కానీ సోమవారం సాయంత్రం ఏడున్నరకు చేరుకున్నానన్నారు.
మూడున్నర గంటలు.. పది కిలోమీటర్లంటూ ఆయన ట్వీట్ చేస్తూ.. అమ్మమ్మ సాయంత్రం నడక కంటే నెమ్మదిగా సెకండ్ గేర్‌లో నత్తకంటే కొంచెం ముందు.. దాదాపు నడకవేగంతో సైకిల్ కంటే నెమ్మదిగా కదిలామంటూ వ్యంగ్యంగా స్పందించారు. అంతేనా.. హైదరాబాద్ ట్రాఫిక్‌ను తాము కొత్తగా ఆవిష్కరించామని, ఫ్లైఓవర్లు స్మార్ట్ సిగ్నల్‌లతో కాదని, అద్భుతమైన గ్రిడ్‌లాక్‌లు, రివర్స్ లేన్లు, రోడ్డు చెరువులతో అంతకంటే ఎక్కువగా ట్రాఫిక్ కంటే వేగంగా కదిలే ప్రజల ఆగ్రహంతోనంటూ ఎక్స్‌లో మండిపడ్డారు.
మోకాలి లోతు నీరు రోడ్డు మొత్తాన్ని చెరువులా మార్చేసింది.. ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు.. పౌర విపత్తు అంటూ స్పందించారు. ప్రజలు కట్టిన డబ్బు ఎక్కడికి పోతోంది. కోట్ల రూపాయలు పన్ను వసూలు చేసినప్పటికీ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు.. దీనికి కారణం అధికారులు, పాలకులు అందరూ ఈ పతనానికి భాగస్వాములేనంటూ సుధాకర్‌రెడ్డి ఫైరయ్యారు.