సిటీబ్యూరో, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ): హైడ్రా అధికారిక సోషల్ మీడియాలో మాజీ సీఎం కేసిఆర్‌ను విమర్శిస్తూ పెట్టిన పోస్టులపై నెటిజన్లు మండిపడుతున్నారు. వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ హైడ్రాపై చేసిన వ్యాఖ్యలను హైడ్రా టీజీ పేరుతో ఉన్న అకౌంట్లో కోడ్ చేస్తూ కేసీఆర్‌ను విమర్శించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘గులాబీ పార్టీ సిల్వర్ జూబ్ల్లీ వేడుకల్లో హైడ్రాపై నోరుపారేసుకున్న సీఎం కేసీఆర్, నిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు మాట్లాడిన కేసీఆర్, అవగాహనారాహిత్యంతో మాట్లాడి స్థాయిని దిగజార్చుకున్న కేసీఆర్’ అంటూ హైడ్రా వారియర్స్ పేరుతో ఉన్న ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు.
దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ఆ పోస్ట్‌కు వస్తున్న కామెంట్లతో పాటు సాధారణ ప్రజల్లో కూడా హైడ్రా తీరుపై చర్చ జరుగుతోంది. ‘హైడ్రాచర్యల పట్ల కోర్టు చివాట్లు పెట్టలేదా.. మీరు ఇంకా మారరా’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘అసలు రంగనాథ్ ప్రజల కోసం పనిచేస్తున్నారా.. రేవంత్‌రెడ్డి కోసమా.. ఇలాంటి చెత్తరాతలెందుకంటూ’ సోషల్ మీడియా వేదికగా హైడ్రా కమిషనర్‌పై
విరుచుకుపడుతున్నారు.
అయితే హైడ్రా ఫ్యాక్ట్ చెక్ చేసి ఈ అకౌంట్ అఫీషియల్ హ్యాండిల్ కాదంటూ పెట్టుకున్నారు. అయితే అది అధికారిక సైట్ కానప్పుడు ప్రభుత్వ లోగోలు ఎలా వాడతారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంలో హైడ్రా ఎటువంటి ప్రకటన చేయకపోయినా అఫీషియల్ హ్యాండిల్ కాదంటూ బ్యానర్లోనే పోస్ట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో నడుస్తున్న హైడ్రా అధికారిక ఎక్స్ హ్యాండిల్ ఉండగానే మరో అకౌంట్ రావడం అది కూడా హైడ్రా టీజీ పేరుతో వచ్చి అందులో హైడ్రా లోగోలు వాడుతుంటే రంగనాథ్ ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు..
హైడ్రా పేరుతో ఇలా నకిలీ ఖాతాలు వస్తే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదంటూ నెటిజన్లు ప్రశ్నలమీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఒక ప్రభుత్వ శాఖ అధికారిక అకౌంట్లో ఆ భాష ఏంటని, ఆల్ఇండియాసర్వీసెస్ కండక్ట్ రూల్‌బుక్‌లోని రూల్ 5లో ఒక ఐపీఎస్ అధికారి ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేయవద్దని, ఏ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని రంగనాథ్‌కు తెలియదా అంటూ నెటిజన్లు మండిపడ్డారు. హైడ్రా పేరిట నకిలీ ఖాతాలు ఉంటే ఎందుకు ఫిర్యాదు చేయలేదని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
గంట కింది వరకు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్గా ఫోజులు కొట్టిన హైడ్రా టీజీ హ్యాండిల్ తాను ప్రశ్నించగానే అకస్మాత్తుగా బయో ఎందుకు మార్చారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ సోషల్‌మీడియా విభాగం ఇన్చార్జ్ కొణతం దిలీప్ ప్రశ్నించారు. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన రంగనాథ్ ఆధ్వర్యంలో నడిపే హైడ్రా విభాగం మరీ ఇంత ఘోరంగా అబద్దాలు ఆడుతుంటే ఆయన ఎలా చూస్తూ ఊరుకుంటున్నారంటూ దిలీప్ ట్వీట్ చేశారు.
హైడ్రా టీజీ హ్యాండిల్‌కు అనుబంధంగా పనిచేస్తున్న వాట్సప్, ఇన్‌స్ట్రాగాం హ్యాండిల్, యూట్యూబ్ చానెల్ అన్నీ అనధికారికమైనవేనా.. మరి ప్రభుత్వ ఎంబ్లమ్స్ వాడి అనధికారిక అకౌంట్లు నడుపుతుంటే ఒక ఐపీఎస్ అధికారి అయిన రంగనాథ్ కనీసం గమనించలేదా అంటూనే ఈ ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేస్తున్న పోస్టర్లలో ఉన్న ఫోన్ నెంబర్ ట్రూకాలర్‌లో కొడితే హైడ్రా తెలంగాణ అని వస్తుందని, ఇదే నెంబర్‌తో అనేక వాట్సప్ గ్రూపుల్లో హైడ్రా వీడియోలు, సమాచారం షేర్ చేస్తున్నారని, ఇవేవీ కూడా హైడ్రాకు చెందినవి కాదా అని రంగనాథ్‌ను ట్విట్టర్ వేదికగా కొణతం అడిగారు.
అయినా హైడ్రా పేరుమీద అనేకమంది వసూళ్లు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్న సమయంలో హైడ్రా పేరుతో ఈ ఆకతాయి చేష్టలేంటంటూ మండిపడ్డారు. ఒక ఎన్ఫోర్స్మెంట్ శాఖను నడుపుతున్నారని, అది పోలీస్ శాఖతో సమానమైనదని, మరి ఆ శాఖ పేరు మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సోషల్‌మీడియా ఖాతాలు నడుపుతుంటే మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కొణతం దిలీప్ హైడ్రా కమిషనర్‌ను ప్రశ్నించారు. ఈ సోషల్ మీడియా అకౌంట్లు, ఫోన్‌నెంబర్ హైడ్రావా లేక కాంగ్రెస్ పార్టీవా కొంచెం వివరణ ఇవ్వాలంటూ రంగనాథ్‌ను కొణతం కోరారు.