
వెంగళరావునగర్, జనవరి 7 : ఆయుర్వేద మందుతో నరాల బలహీనత సమస్య దూరం చేస్తామంటూ ఓ ఉద్యోగి వద్ద ఆగంతకులు రూ.1.14 లక్షలు కొట్టేశారు. ఎస్ఆర్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. జెక్‌కాలనీకి చెందిన బి.శివకుమార్ బీడీఎల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్ 18న మూసాపేటకు తన బైక్ పై వెళ్లి..తిరిగి వస్తూ.. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనం పై దంపతులుగా చెప్పుకున్న ఇద్దరిని పలకరించాడు. వారు శివకుమార్ కాలుకు బ్యాండేజీలు చుట్టి ఉండటంతో నరాల సమస్య ఉన్నట్లు గుర్తించి.. పరశురాం అనే వ్యక్తి మెల్లగా మాట కలిపాడు. తన మిత్రుడి తండ్రికి కూడా ఇదే తరహా సమస్య ఉండేదని..తక్కువ ఖర్చుతో ఆయుర్వేద వైద్యంతో బాగయ్యిందని నమ్మబలికాడు. శివకుమార్ ఫోన్ నంబర్ తీసుకొని.. అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. మరుసటి రోజు అనిల్ అనే వ్యక్తి శివకుమార్‌కు ఫోన్ చేసి.. తన తండ్రికి కూడా ఇదే తరహా సమస్య ఉండటంతో ఆయుర్వేద మందుతో నయం అయ్యిందని, మందు తయారు చేసే విధానం ఇంటికి వచ్చి చెబుతానన్నాడు. మరుసటి రోజు జెక్‌కాలనీలోని శివకుమార్ ఇంటికి అనిల్ వచ్చాడు. రూ.500 ఖర్చు చేయించి కొబ్బరికాయలు, బాదం, రోజ్ ఫ్లవర్, పసుపు, యాలకులు తదితర మిశ్రమాలను చేయించాడు. ఇందులో కొన్ని ఆయుర్వేద వనమూలికలు కూడా కలిపితే.. పూర్తి ఔషధం తయారవుతుందని చెప్పాడు. మరుసటి రోజు వెంగళరావునగర్ కాలనీలోని ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక దుకాణానికి తీసుకుపోయాడు. అక్కడ ఉన్న ఆనంద్, ఆనందప్పలతో పాటు మరో వ్యక్తి మాయ మాటలు చెప్పి, ఒత్తిడి చేసి లక్షా 14 వేల 365 రూపాయలు తీసుకుని ఏవో మూలికలు అంటగట్టారు. మందు పనిచేయకపోతే డబ్బు తిరిగి ఇస్తామంటూ నకిలీ చెక్కులను కూడా ఇచ్చారు. మూడు నెలలు వాడినప్పటికీ తన కాలు బాగు కాకపోవడంతో అనుమానం వచ్చిన శివకుమార్.. రెండు రోజుల కిందట మూలికలు కొనుగోలు చేసిన ఇంటికి వచ్చి చూస్తే..దుకాణం ఖాళీ చేసినట్లు తెలిసింది. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా, శుక్రవారం కేసు నమోదు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.