నమ్మకంగా ఇంట్లోకి వచ్చి , నయవంచనతో ప్రాణాలు తీసి, కోట్లతో సరిహద్దులు దాటుతున్న నేపాలీ ముఠా ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. ఇటీవల బంజారాహిల్స్‌లో మాజీ డీజీపీ ఇంట్లో దోపిడీ, హత్యకు పాల్పడిన నేపాలీ ముఠా… తాజాగా జవహర్‌నగర్ పరిధిలో మరో దోపిడీకి పాల్పడి పరారయ్యింది. నేపాలీ ముఠాలు అత్యంత పకడ్బందీ ప్లాన్‌తో ఇండ్లను ఎంచుకుంటాయి. సికింద్రాబాద్, బోయిన్పల్లి, సైనిక్‌పురి, జవహర్‌నగర్, బంజారాహిల్స్, శ్రీనగర్‌కాలనీ, గోషామహల్ ప్రాంతాలలోని ధనవంతుల ఇండ్లనే లక్ష్యంగా చేసుకుంటాయి. హిందీ ఎక్కువ మాట్లాడే కుటుంబాలే నేపాలీలను పనిలో పెట్టుకుంటున్నాయి. నమ్మకంగా కొన్నాళ్లు పనిచేస్తూ ఈ ముఠాలు సమయం చూసి పంజా విసురుతున్నాయి.

సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ)జవహర్‌నగర్/నేరేడ్మెట్: నేపాల్ నుంచి హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ రాష్ర్టాలలో సెక్యూరిటీతో పనిచేసేందుకు మనిషులను సరఫరా చేసే ముఠాలు ఉంటాయి. అయితే కొన్ని ముఠాలు దోపిడీనే టార్గెట్‌గా చేసుకొని పనివాళ్లను రంగంలోకి దింపుతున్నాయి. ఇలా ఒకరు పనిలో చేరితే… కొన్ని రోజుల తరువాత వారి తరపున వాళ్లు ఇంకొకరు కూడా పనిలో చేరుతారు. కొన్నాళ్లు పనిచేసిన తరువాత ఇంట్లో ఉండే వారి సమాచారం… వారి రోజు వారీ ఖర్చులు… ఫంక్షన్లకు వెళ్లే సమయంలో వేసుకునే ఆభరణాలు, ఇంటికి తరచూ తీసుకొచ్చే డబ్బులు ఇలా అన్ని విషయాలను గుర్తించి .. ఆ సమాచారాన్ని తమ గ్యాంగ్ లీడర్లకు చేరవేస్తుంటారు. సాధారణంగా యజమానులు దూర ప్రాంతాలకు వెళ్లడం, ఏదైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు తమ ప్లాన్‌ను అమలు చేస్తా రు. చాలా మంది ఇంట్లో వృద్ధులు ఉంటే వాళ్ల ను ఇంట్లోనే ఉంచి మిగతా వారు బయటకు వెళ్తుంటారు. వృద్ధులు ఇంట్లో ఉన్నప్పుడే ఈ ముఠాలు చెలరేగిపోతుంటాయి. ఇంట్లో ఉండే ఒంటరి మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని ఇంట్లో ఉండే ఆస్తినంతా కొట్టేస్తుంటారు.
సరిహద్దులు దాటేస్తారు…!
ఇంట్లో ఉన్నవారిని నిర్భంధించి మత్తుమందు చల్లడం, అవరకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను అపహరించి అక్కడి నుంచి పరారవుతారు. అయి తే బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యా దు చేయకుండా ఉండేందుకు బాధితులను నిర్బంధించి, ఇంటికి బయటకు నుంచి తాళం వేసి వెళ్లిపోతారు. అర్ధరాత్రి సమయంలో ఆటోలను బట్టి రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్ల నుంచి హైదరాబాద్‌ను వదిలేసి పరారవుతారు. పోలీసులకు సమాచారం వచ్చే వరకు ఈ ముఠాలు రాష్ట్రం దాటి వెళ్లిపోతాయి.. కొన్ని సందర్భాలలో ఇతర రాష్ర్టాలలోకి చేరుకుంటాయి. అక్కడి నుంచి వివిధ మార్గాల ద్వారా తమ స్వస్థలాలకు చేరుకుంటాయి. ఈ ముఠాలకు అక్కడక్కడ సహకరించే వారు ఉంటారని పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్నది.
పోలీసుల తనిఖీలు
ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో నేపాలీ గ్యాంగ్ నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో వాయిపురి, డిఫెన్స్‌కాలనీ, సాయినాథ్‌పురం, చంద్రగిరి కాలనీ, ఆఫీసర్స్ కాలనీ, ఆర్కేపురం కాలనీలో తనిఖీలు చేపట్టారు. అక్కడ పనిచేస్తున్న నేపాలీల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మత్తు మందు ఇచ్చి..నిర్బంధించి..
జవహర్‌నగర్, మే 13: ఓ నేపాలీ ముఠా వృద్ధ దంపతులను బెదిరించి… మత్తు మం దు ఇచ్చి..నిర్బంధించి.. భారీ దోపిడీకి పాల్పడింది. జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కౌకూర్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కౌకూర్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో విశ్రాంత ప్రొఫెసర్ మురళీమోహన్(68), భార్య డాక్టర్ విజయలక్ష్మి(58)తో కలిసి నివసిస్తున్నారు. కొంత కాలంగా నేపాల్‌కు చెందిన వారు వీరింట్లో పని మనుషులుగా చేరి నమ్మకంగా ఉంటున్నారు. 10రోజుల కిందట మరో మహిళ నేపాల్‌కు చెందిన వారి బంధువుగా పరిచయమై ఇంట్లోనే నివస్తున్నది.
కాగా, నేపాలీ గ్యాంగ్‌లోని ఒకరిది పుట్టిన రోజు వేడుకలంటూ వృద్ధులను నమ్మించారు. దంపతులు భోజనం చేస్తుండగా, వెనక నుంచి వచ్చిన నేపాలీ గ్యాంగ్ వారిని బెదిరించగా, ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. వారికి మత్తు మందు ఇచ్చి… బెడ్రూ ంలోకి తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేశారు. బీరువాలోని 60 తులాల బంగారు ఆభరణాలు, 15కేజీ వెండి, 3వేల డాలర్లు, విలువైన వస్తువులను తస్కరించారు. ఇంటి కి తాళాలు వేసి ఆటోలో పారిపోయారు. మత్తులోంచి తేరుకున్న దంపతులు సాయం కోసం అరవ్వడంతో స్థానికులు గమనించి ఇంటి తాళాలు పగులగొట్టి వారిని విడిపించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.