సిటీబ్యూరో: వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడిన నేపాల్ ముఠాను ఎట్టకేలకు మలాజిగిరి పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం మల్కాజిగిరి పోలీసు కమిషనర్ సుమతి వివరాలు వెల్లడించారు. కౌకూర్‌లోని మోహన్స్ గోల్ఫ్ ఎన్ క్లేవ్లో మురళీ మోహన్ దంపతులు నివాసముంటున్నారు. రాజేశ్, మీనా తమకు పరిచయమైన సబీనా అలియాస్ సునీత, చాంగ్, సామ్రాట్, బిస్వాల్, కమల్, జంకర్ అలియాస్ శంకర్ల తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
పథకం ప్రకారం సబీనాను మురళీమోహన్ దంపతుల ఇంట్లో పనిమనిషిగా చేర్పించి, రాజేశ్‌ను ఆమె భర్తగా పరిచయం చేశారు. మే 11న రాత్రి రాజేశ్, సబీనా, మీనా, చాంగ్, సామ్రాట్లు మురళీమోహన్ దంపతుల ఇంట్లోకి చొరబడగా, మిగిలిన వారు బయట కాపలాగా ఉన్నారు. నిందితులు వృద్ధ దంపతులను బంధించి, బలవంతంగా మత్తు పదార్థం తినిపించి సృ్పహ తప్పేలా చేశారు. విలువైన వస్తువులను దోచుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బెంగళూరు, లక్నో, నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు పంపించారు. దాదాపు 250కు పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించారు. ఎట్టకేలకు నేపాల్‌కు చెందిన సునీత అలియాస్ సబీనా (28), బిస్వాల్ అలియాస్ విస్వాల్ (30), కమల్ బహదూర్ చలానే (34), జంకర్ బహదూర్ చలానే అలియాస్ శంకర్(38)లను పట్టుకుని అరెస్టు చేసినట్లు సీపీ సుమతి వెల్లడించారు.