నగరంలో ప్రజా రవాణా కోసం కీలకమైన బస్ షెల్టర్లు ఇప్పుడు అధ్వానంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా ఎలుకలు, పందికొక్కులు సంచరిస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రోజుకు లక్షలాది మంది ప్రయాణికులు ఉపయోగించే ఈ షెల్టర్లు పారిశుధ్య లోపంతో ఆరోగ్య హానికర కేంద్రాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రత్యేకంగా రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, ఆసుపత్రులు, కాలనీల వద్ద ఉన్న బస్‌స్టాపుల్లో పరిస్థితి మరింత దారణంగా ఉంది. బస్ కోసం వేచి ఉండే ప్రయాణికుల కాళ్ల దగ్గరే ఎలుకలు తిరుగుతుండంటం సాధారణమైపోయింది. కొన్ని చోట్ల పందికొక్కులు గుంపులుగా సంచరిస్తూ చెత్తను చెల్లాచెదురు చేసేస్తున్నాయి. సరైన శుభ్రత లేకపోవడం వల్ల ఎలుకలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ప్రయాణికులు బస్ షెల్టర్ వద్ద నిలబడకుండా కొంత దూరంలో నిలబడుతున్నారు. ఎలుకల వల్ల లెప్టో స్పిరోసిస్, ప్లేగు వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణికులు అనేకసార్లు ఫిర్యాదులు చేసినా.. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ మధ్య సమన్వయ లోపం కారణంగా సమస్య పరిష్కారం కావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిటీబ్యూరో, మార్చి 22 ( నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో సుమారు 1370 బస్ షెల్టర్లు ఉన్నాయి. ఇందులో చాలా వరకు అపరిశుభ్రతతోనే దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల ఎలుకలు, పందికొక్కులు సంచరిస్తుండటంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో షెల్టర్ల చుట్టూ హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఉండటం వల్ల ఆహార అవశేషాలు పేరుకుపోతున్నాయి. ఇటువంటి పరిస్థితులు కూడా ఎలుకల పెరుగుదలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. బస్సుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో షెల్టర్లలో ఎలుకలు తిరుగుతూ కనిపిస్తున్నాయని ప్రయాణికుడు రవి తెలిపాడు. తక్షణమే శుభ్రత చర్యలు చేపట్టాలని, రెగ్యులర్ ఫాగింగ్, ర్యాట్ కంట్రోల్ చర్యలు అమలు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు సంబంధిత శాఖలు తక్షణమే స్పందించి బస్ షెల్టర్‌లో శుభ్రత, పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని నగర ప్రయాణికులు కోరుతున్నారు.

Rats
షెల్టర్ల నిర్వహణ అస్తవ్యస్తం
బస్షెల్టర్లలో సరైన శుభ్రత, పర్యవేక్షణ సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్ రైతిఫైల్ బస్టాండ్ ముందర డ్రైనేజీ, మురుగు కంపుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌లోకి వెళ్లడానికి రోడ్డు మధ్యలో నిల్చిన డ్రైనేజీ కంపును దాటాల్సి వస్తుండటంతో నరకం చూస్తున్నారు. ముఖ్యంగా మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. కవాడిగూడ, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లోని బస్సు షెల్టర్లన్నీ దుర్వాసనకు నిలయాలుగా మారాయని, చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినాప్రయోజనం లేదని వాపోతున్నారు.
నగరంలో 2800 బస్సులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. 30వేల ట్రిప్పులు కొనసాగుతున్నాయి. మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీం రాకముందు గ్రేటర్లో ఒక్క రోజుకు 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేవారని అధికారులు చెబుతున్నారు. ఉచిత ప్రయాణం వచ్చాక ఒక్క రోజుకు 26లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఇందులో మహిళా ప్రయాణికులు సుమారు 16 లక్షల మంది ఉన్నారు. మరోవైపు బస్ పాస్ ఛార్జీలు, టీ24 ధరలు సైతం పెంచేశారు. చార్జీలు పెంచడం తెలుసుకానీ బస్ షెల్టర్ల నిర్వహణ మరిస్తే ఎలా అని నగర ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.