సుల్తాన్‌బజార్, నవంబర్ 27 : విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం తానంతటదే వరిస్తుందని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ రావుల గిరిధర్ పేర్కొన్నారు. ఆదివారం మాసబ్ ట్యాంక్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైఫాబాద్ సైన్స్ పీజీ కళాశాలలో ఎన్సీసీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయనకు, కళాశాల ప్రిన్సిపాల్ జే లక్ష్మణ్‌నాయక్, 3 తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ లెఫ్ట్‌నెంట్ అధికారులు సంజీవ్, వసంత్, రాఖేశ్, ఎన్సీసీ అధికారి డాక్టర్ పల్లాటి నరేశ్‌లతో కలిసి ఎన్సీసీ వేడుకలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు పరేడ్‌ను అద్భుతంగా నిర్వహించారని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మణ్‌నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు రిపబ్లిక్ డే పరేడ్‌కు, నావికాదళం, ఆర్మీలో అవకాశాలను సంపాదించడం గర్వంగా ఉందని చెప్పారు.
20 మంది విద్యార్థుల ఎంపిక..
ఓ భుజంపై విద్య, మరో భుజంపై దేశ రక్షణ అనే నినాదంతో ముందుకు సాగుతున్న సైఫాబాద్ సైన్స్ కళాశాల ఎన్సీసీ క్యాడెట్ల తీరే వేరు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తూ.. సామాజికసేవతో పాటు ఆర్డీసీ, నావికాదళం, ఆర్మీలో ఉద్యోగాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ఫథ్లో నిర్వహించే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు గడిచిన ఐదేండ్లలో పదుల సంఖ్యలో ఆర్డీ పరేడ్‌కు సైఫాబాద్ సైన్స్ కళాశాల నుంచి 2015లో కె.నరేశ్(ఎంపీసీఎస్), 2016లో ఎంపీజీకి చెందిన ప్రశాంత్, సుచరితలు, 2017లో వరుణ్(ఎంపీసీ), 2018లో సీహెచ్ ఉత్తమ్‌కుమార్(ఎంపీసీ), 2019లో అలీ పాషా(ఎంపీసీ), 2020లో ఎంపీసీ విద్యార్థిని మేఘన ఎంపికయ్యారు.
ఆర్డీసీ క్యాంప్ కోసం క్యాడెట్లు సుమారు 45 రోజుల కఠిన శిక్షణ తీసుకుంటారు. ఆర్డీసీ క్యాంప్‌తో పాటు అనేక క్యాంపులలో కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటారు.ప్రీ ఆర్డీసీ క్యాంప్‌లో ఎన్సీసీ క్యాడెట్లు ఎల్ సుల్తాన్, బి కావేరిలు పాల్గొనగా, 2022లో టీఎస్సీ-ఐజీసీ క్యాంపులో ప్రకాశం జిల్లా చీరాలలో జి. సిద్ధూ ఉత్తమ క్యాడెట్‌గా ప్రతిభ చాటారు. ఈ కళాశాలలో ఎన్సీసీ క్యాడెట్ 2017 బ్యాచ్‌కు చెందిన పి. రాంరెడ్డి ప్రస్తుతం ఆర్మీ అధికారిగా జమ్మూలో విధులు నిర్వహిస్తుండగా.. అదే బ్యాచ్‌కు చెందిన కృష్ణ ఆర్మీ(నర్సింగ్)లో విధులు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్‌లో ఎన్సీసీ క్యాడెట్లు సాయికుమార్, చంద్రశేఖర్, రాజ్‌కుమార్, ఏ శ్రీను, అభినయ్ బాల, ఆకాశ్‌లు నావికా దళంలో ఎస్ఎస్ఆర్ ఆఫీసర్లుగా ఎంపికై ఒడిషాలోని చిలకాట్రెయినింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నారు.
సామాజిక కార్యక్రమాల్లో ఎన్సీసీ క్యాడెట్లు..
సైఫాబాద్ సైన్స్ కళాశాలలోని 3టి తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్లు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. అనాథ ఆశ్రమంలో చిన్నారులకు ఎన్సీసీ క్యాడెట్లు నోట్ బుక్స్ మెటీరీయల్‌తో పాటు తమ సొంత డబ్బులతో అన్నదానం చేస్తూ సామాజిక సేవలో భాగమవుతున్నారు.
ఎన్సీసీ క్యాడెట్లకు ప్రత్యేక శిక్షణ
కాలేజీలో విద్యార్థులకు ఎన్సీసీలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. కళాశాల నుంచి ఇప్పటికే ఆర్మీ, నావికాదళంతో పాటు ఆర్డీఎస్కు 20 మంది ఎంపిక కావడం గర్వకారణం. భవిష్యత్తులో దేశ రక్షణ వ్యవస్థలో కళాశాల నుంచి క్యాడెట్లను రెట్టింపు చేస్తాం.
– ప్రొఫెసర్ జే లక్ష్మణ్ నాయక్, ప్రిన్సిపాల్
భావిపౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ప్రస్థుత విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలాగా శారీరకంగా, మానసికంగా సిద్ధం చేస్తున్నాం. క్యాడెట్లకు ప్రధానంగా సమయస్ఫూర్తి, సమయపాలన ఉండాలని అన్నారు. – డాక్టర్ పల్లాటి నరేశ్, ఎన్సీసీ ఆఫీసర్,సైఫాబాద్ సైన్స్ కళాశాల
చాలా ఆనందంగా ఉంది
సైఫాబాద్ సైన్స్ కళాశాల తన జీవితాన్ని తీర్చిదిద్దింది. గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎన్సీసీ క్యాడెట్‌గా శిక్షణ తీసుకున్న అనంతరం నావికాదళంలో ఎన్ఎస్ఆర్ ఆఫీసర్‌గా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది.
– విద్యార్థి సాయికుమార్, నావికాదళం,
ఎస్ఎస్ఆర్ ఆఫీసర్‌గా ఎంపికైన ఎన్సీసీ క్యాడెట్
కళాశాలలో ఎన్సీసీ క్యాడెట్లకు ప్రత్యేక ప్రాధాన్యత
కళాశాలలో ఎన్సీసీ క్యాడెట్ల శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది . ఎన్సీసీ అధికారి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో తాము నావికాద ళంలో ఉద్యోగం సంపాదించేందుకు దోహదం చేసింది. – విద్యార్థి ఆకాశ్, నావికాదళం, ఎస్ఎస్ఆర్ ఆఫీసర్
దేశ రక్షణపై మక్కువతో ఎన్సీసీలో చేరా..
ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు మారుమూల గ్రామం నుంచి సైఫాబాద్ సైన్స్ కళాశాలకు వచ్చా. ఇక్కడ చేరిన అనంతరం దేశ రక్షణపై మక్కువతో ఎన్సీసీలో చేరాను. కళాశాలలో ఎన్సీసీ అధికారులు ఇచ్చిన ప్రత్యేక శిక్షణతో తాను నావికా దళంలో ఎస్ఎస్ఆర్ ఆఫీసర్‌గా అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది.
– విద్యార్థి అభినయ్ బాల, నావికాదళం, ఎస్ఎస్ఆర్ ఆఫీసర్