Pollution | సిటీబ్యూరో: పరిశ్రమల నుంచి విడుదలయ్యే ఉద్గారాలు ఓ వైపు.. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం మరోవైపు… వెరసి గ్రేటర్లో పొల్యూషన్ పరిమితికి మించి పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు నడుంబిగించారు. పొల్యూషన్ వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రేటర్లో సుమారు 80 లక్షలకు పైన వాహనాలు ఉన్నాయి. వాటి నుంచి రోజుకు 1500 టన్నులకు పైగా కాలుష్యకారకాలు విడుదలవుతున్నాయని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.
కఠిన చర్యలకు ప్రణాళికలు..
వాహనాల కాలుష్య తనిఖీలు ఇక మీదట పకడ్బందీగా జరగనున్నాయి. పాత వాహనాలతో రోడ్లెక్కుతున్న వారిపై ఆర్టీఏ అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. అందులో భాగంగానే పొల్యూషన్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రైవేటు సంస్థలు వాహనాల కాలుష్య తనిఖీలు చేసి సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నాయి. అయితే వారిచ్చే రీడింగ్స్ వివరాలు ఎంత వరకు సరైనవోననే అనుమానాలు కొంతమందిలో ఉన్నాయి. ఈ వివరాలు అన్నీ సెంట్రల్ సర్వర్లో అప్లోడ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా పొల్యూషన్ తనిఖీల్లో ఇటీవల 25 ద్విచక్ర వాహనాలను, 14 ఫోర్వీలర్స్ను ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్కూల్జోన్లలో ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతూ పొగలు చిమ్ముతున్న వాహనాలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేస్తున్నారు.