సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభయహస్తం దరఖాస్తుల ఎంట్రీ ప్రక్రియను జీహెచ్ఎంసీ ముగించింది. ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తుల డేటా ఎంట్రీని 5వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కలిసి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో దరఖాస్తు వివరాలను కంప్యూటరీకరించారు. ఆరు జోన్ల పరిధిలో 19,06,137 దరఖాస్తుల డేటా ఎంట్రీని మంగళవారం రాత్రి వరకే పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అభయహస్తం దరఖాస్తులతో పాటు అదనంగా రేషన్ కార్డు తదితర ఇతర పథకాలకు వచ్చిన 5,73,069 అప్లికేషన్ల ఎంట్రీ త్వరలో పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.
ఇంటింటి సర్వేతో దరఖాస్తుల పరిశీలన..
దరఖాస్తుల కంప్యూటరీకరణ ప్రక్రియ ముగియడంతో అధికారుల బృందాలు ఇంటింటి సర్వే ద్వారా దరఖాస్తుల పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. ఏ పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయో! తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్వేరంటూ ఏమీ లేదు. అయితే ప్రజలు ఆసక్తి చూపిన ఆధారంగా..దరఖాస్తుల్లో ఎక్కువగా మహాలక్ష్మి, గృహ జ్యోతి పథకాలకే దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ బండను అందించనున్నారు. గృహ జ్యోతితో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇవ్వనున్నారు. తదుపరి ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, చేయూత దరఖాస్తులున్నట్లు తెలుస్తోంది. అభయహస్తం ఐదు పథకాలతోపాటు రేషన్ కార్డు, ఇతర వ్యక్తిగత లబ్ధికి సంబంధించి తెల్లకాగితంపై విజ్ఞప్తులు వచ్చాయి. ప్రస్తుతానికి అర్హుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు. మార్గదర్శకాలు వచ్చాక మరో దఫా సర్వే చేసి అర్హుల పేర్లను పోర్టల్లో ఉంచుతారని అధికారవర్గాలు చెబుతున్నాయి.
అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ వివరాలు
జోన్ : దరఖాస్తుల ఎంట్రీ
ఎల్బీనగర్ : 2,42,579
చార్మినార్ : 5,08,772
ఖైరతాబాద్ : 3,25,641
శేరిలింగంపల్లి : 1,70,811
కూకట్పల్లి : 3,14,685
సికింద్రాబాద్ : 3,00,051
కంటోన్మెంట్ బోర్డు : 43,598
: 19,06,137