మేడ్చల్, మే 16 : రైతే రాజు అనే మాటకు కాలం చెల్లింది. ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెడుతున్న రైతులు వడ్లు కొనండంటూ బతిమాలుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.ఒక వైపు ప్రకృతి సహకరించకపోవడం, మరోవైపు అధికారులు, మిల్లర్ల మధ్య సమన్వయం లోపం, కొనుగోలు కేంద్రాల వద్ద తాలు, తేమ తదితర కారణాలతో తిరస్కారం.. వెరసి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. తప్పని పరిస్థితితో దళారులకు వడ్లను తక్కువ ధరకు అమ్ముకొని, నష్టపోతున్నారు.ఇది మేడ్చల్ మండలంలోని రైతు దుస్థితి.
మేడ్చల్ మండలంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. రైతులు వడ్లను ఆరబెట్టుకునేందుకు ప్రకృతి సహకరించడం లేదంటే కొనుగోలు కేంద్రాల వద్ద తేమ ఎక్కువ ఉందని తిరస్కరిస్తున్నారు. ప్రతి రోజు వర్షం పడుతుండటంతో ధాన్యం తడుస్తుండటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా ధాన్యం ఆరబెట్టుకునే సౌకర్యాలు లేకపోవడంతో ఎక్కువ మంది రైతులు దూరంగా ఉన్న సర్వీస్ రోడ్లు, బల్ల పరుపుగా ఉండే బండలపైన ఆరబెట్టుకుంటున్నారు.
ధాన్యం ఆరింది అనుకునే లోపు వర్షం పడుతుండటంతో తేమ శాతం పెరుగుతుంది. గౌడవెల్లి గ్రామ పరిధిలోని రింగురోడ్డు సర్వీసు రోడ్డులో ఓ రైతు ఆరబెట్టుకున్న వడ్లు బుధవారం నాటి గాలి, వర్షానికి కొట్టుకొని పోయాయి. ఇలాంటి పరిస్థితిలో ఒకటి, రెండు పాయింట్లు నిబంధన ప్రకారం తేమ ఎక్కువగా ఉంటే తీసుకోకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
అలాగే గతంలో తాలు గురించి పెద్దగా పట్టించుకునే వారు కాదని, ఇప్పుడు తాలు పేరుతో కూడా వడ్లను కొనుగోలుకు తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 కిలోలకు 41.5 కిలోల నుంచి 42 కిలోల వరకు ధాన్యాన్ని బస్తాల్లో నింపుతున్నా తీసుకోవడం లేదని రైతులు తెలిపారు. ముందుగా తాలుపై తమకెలాంటి సమాచారం లేదని, తూర్పారా బట్టేందుకు గాలి రావడం లేదని, అనువైన పరికరాలు కూడా తమ వద్ద లేవని వాపోతున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద నిర్వాహకులు చేతులు తడిపితేనే వడ్లను తీసుకుంటున్నారని రాయిలాపూర్, గౌడవెల్లి రైతులు ఆరోపిస్తున్నారు.
ధాన్యం దళారులు పాలు..
తేమ, తాలు పేరుతో ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బంది పెడుతుంటే రైతులు పక్క చూపులు చూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడి, అధికారులను బతిమాలుకునే కన్నా ఎంతకైతే అంతకు దళారులకు అమ్ముకోవాలని చూస్తున్నారు. రాయిలాపూర్‌కు చెంది సత్తిరెడ్డి అనే రైతు కొనుగోలు కేంద్రం వద్ద బాధపడ లేక 220 క్వింటాళ్ల సన్న వడ్లను 2150 క్వింటాల్ చొప్పున అమ్ముకున్నాడు.
అదే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించి ఉంటే రూ.500 బోనస్ కలుపుకొని రూ.2820 క్వింటాల్‌కు వచ్చేది. ఈ లెక్కన క్వింటాల్‌కు రూ..670 చొప్పున 220 క్వింటాళ్లకు రూ.1,47,400 నష్టపోయాడు. అదే గ్రామానికి చెందిన మరో రైతు శేఖర్ రెడ్డి 250 క్వింటాళ్ల దొడ్డు రకం వడ్లను రూ.2030కే అమ్ముకున్నాడు. ఆయనకు క్వింటాల్‌కు రూ.270 చొప్పున రూ.67,500 నష్టం వచ్చింది. ఇలా మండలంలోని వేల క్వింటాళ్లో ధాన్యం దళారుల పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగాశుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మేడ్చల్ జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సుగుణాబాయి, ఏడీఏ వెంకట్ రాంరెడ్డి, ఏవో అర్చన సందర్శించారు. తేమ17 శాతం కంటే తక్కువగా ఉండాలని, ధాన్యంలో తాలు లేకుండా చూసుకోవాలని సూచించారు.
సహకార సంఘం వద్ద ఆందోళన
మేడ్చల్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద గురువారం రాయిలాపూర్, గౌడవెల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేశారు. తేమ, తాలు తదితర కారణాలతో తమ వడ్లను కొనుగోలు చేయకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు తమకు రాలేదని, రైతుల కష్టాన్ని గుర్తించడం లేదని మండిపడ్డారు. విషయాన్ని తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారిణి అర్చన సహకార సంఘం కార్యాలయానికి చేరుకుని, రైతులతో చర్చించారు.
నిబంధనల ప్రకారం 100 కిలోలకు కిలో తాలు ఉండాలని కానీ 40 కిలోలకు 3, 4 కిలోల తాలు వస్తుందన్నారు. ఎఫ్‌సీఐ తిర్కసరిస్తున్న కారణంగా మిల్లర్లు తీసుకోవడం లేదన్నారు. రైతులు తాలు లేకుండా చూసుకోవాలని, నిబంధనల ప్రకారం తేమ పాటించాలని సూచించారు. కాగా భూదాన్ పోచంపల్లిలో ఉన్న మిల్లర్‌తో ఏవో ఫోన్లో మాట్లాడారు. రైతులకు ప్రకృతి సహకరించక ఇబ్బంది పడుతున్నారని, 2, 3 శాతం తాలు ఉన్నా తీసుకోవాలని కోరారు. 40కి 42 కిలోల బస్తాలో ధాన్యం పంపిస్తారని, అంగీకరించాలన్నారు. ఇందుకు మిల్లర్ మాట్లాడుతూ తాలు ఎక్కువగా ఉంటే తీసుకోలేమని తేల్చిచెప్పాడు.