నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 30(నమస్తే తెలంగాణ): ప్రతీ మూడు నెలలకోసారి ఏర్పా టు చేస్తున్న జాతీయ లోక్‌అదాలత్ వచ్చేనెల 14వ తేదీన నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావేద్ పాషా శుక్రవారం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో ముఖాముఖీలో ముచ్చటించారు. గతంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో దేశంలోనే హైదరాబాద్ జిల్లా మొదటిస్థానంలో నిలిచిందని, రాబోవు జాతీయ లోక్ అదాలత్‌ను సైతం తొలి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కోరారు.
సెప్టెంబర్ నెలలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 1,57,370 కేసులను పరిష్కరించిందని, డిసెంబర్లో 1,71,169 కేసులను,మార్చిలో 2,29,189 కేసులను తొలగించి హైదరాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, మనోరంజన్ ప్రాంగణంలోని కోర్టులకు చెంది న కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. వచ్చే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రథమ స్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్ జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లకు చెందిన పోలీసు అధికారులతో జాతీయ లోక్ అదాలత్‌పై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కక్షిదారులను ప్రోత్సహించేందుకు పోలీసులు సహకరించాలని, కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృధా చేసుకోకుండా తెలియజేయడం ద్వారా మరోసారి హైదరాబాద్ జిల్లా ప్రథమస్థానం సాధించే అవకాశం ఉంటుందన్నారు.
రుణాలు పొందిన ఖాతాదారులు తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో వారిపై నమోదైన కేసులను పరిష్కరించే దిశగా బ్యాంక్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.హైదరాబాద్ జిల్లాలో మేనేజర్లతోపాటు ఉద్యోగులకు పలు సూచనలు ఇచ్చామన్నారు. చెక్కుబౌన్స్, రోడ్డు ప్రమాదాలు, వివాహ సంబంధ కేసులు, ఎక్సైజ్, బీఎన్ఎస్ కింద నమోదైన రాజీకి వీలున్న కేసుల పరిష్కారానికి మంచి వేదికన్నారు. కేసుల పరిష్కారానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు విశేషంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాజీకి వీలుండే కేసులను గుర్తించి ఇరు వర్గాలకు చెందిన కక్షిదారులను రాజీ చేసుకునేందుకు సహకరించి అధిక కేసుల పరిష్కారానికి జడ్జిలు సహకరించాలని కోరినట్టు తెలిపారు.
నాంపల్లి కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు రవికిశోర్‌తోపాటు ప్రధాన కార్యదర్శి ఎన్వీ.రమణగౌడ్ నేతృత్వంలో విజయవంతంగా మరోసారి హైదరాబాద్ జిల్లాను తొలి స్థానంలో నిలిచేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు.