MLA Sudheer Reddy | మన్సురాబాద్, జూన్ 26 : కాలనీలలో సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరింపజేసి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన లైన్లను ఏర్పాటు చేయిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి నరసింహ స్వామి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫేస్ 1 సభ్యులు గురువారం ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
కాలనీలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని, లో ఓల్టేజ్ సమస్య పరిష్కారం కోసం కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి త్రీఫేస్ కరెంటును ఇప్పించాలని, నూతన రోడ్లను ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యేను కాలనీవాసులు కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నరసింహ స్వామి కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరింపజేసి ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తానని తెలిపారు. ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించడంతోపాటు.. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి కాలనీలో నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయిస్తానన్నారు. డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేసిన అనంతరం రోడ్ల నిర్మాణాలు చేపడతామని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో నాగోల్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, కాలనీ గౌరవ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, అధ్యక్షుడు రామచంద్రం యాదవ్, ప్రధాన కార్యదర్శి అనిల్ రెడ్డి, కోశాధికారి మధుసూదన్ రెడ్డి, సభ్యులు పాండురంగం, శివకుమార్, నరేందర్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.